అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు.. అడవిలోకి దూసుకెళ్లిన వైనం

తృటిలో తప్పిన పెను ప్రమాదం.. 20 మంది ప్రయాణికులు సురక్షితం

మహాదేవపూర్, ఆగస్టు 8 (ఆంధ్రప్రభ): జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్‌ మండల కేంద్రం సమీపంలోని అయ్యప్పస్వామి ఆలయం వద్ద జాతీయ రహదారిపై ఆర్టీసీ ఎలక్ట్రిక్‌ బస్సు అదుపుతప్పి రహదారి పక్కనున్న అడవిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 20 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది. బస్సు అదుపుతప్పడంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.

మహాదేవపూర్, ఆంధ్రప్రభ: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్‌ మండల కేంద్రం సమీపంలోని అయ్యప్పస్వామి ఆలయం వద్ద జాతీయ రహదారిపై ఆర్టీసీ ఎలక్ట్రిక్‌ బస్సు అదుపుతప్పి రహదారి పక్కనున్న అడవిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 20 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది. బస్సు అదుపుతప్పడంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.

సాంకేతిక సమస్యతో అదుపుతప్పిన బస్సు

వరంగల్‌ నుంచి కాళేశ్వరం వైపు ప్రయాణికులతో వస్తున్న ఎలక్ట్రిక్‌ ఆర్టీసీ బస్సు మహాదేవపూర్‌ అయ్యప్పస్వామి ఆలయం సమీపంలోని జాతీయ రహదారిపైకి చేరుకోగానే ఒక్కసారిగా సాంకేతిక సమస్య తలెత్తినట్లు సమాచారం. స్టీరింగ్‌, బ్రేక్‌ వ్యవస్థలో సమస్య ఏర్పడటంతో బస్సును అదుపులోకి తీసుకురావడం కష్టంగా మారింది. దీంతో బస్సు రహదారి నుంచి పక్కకు దూసుకెళ్లి అడవిలోకి ప్రవేశించింది.

బస్సును అదుపులోకి తీసుకువచ్చే క్రమంలో ఒక్కసారిగా అది తిరిగి వరంగల్‌ వైపు దిశగా ఆగిపోయింది. అదృష్టవశాత్తూ బస్సు బోల్తా పడకపోవడంతో పాటు ప్రయాణికులకు ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. దీంతో ప్రయాణికులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

అధిక లోడుతో ఇసుక లారీల రాకపోకలు

ఇదిలా ఉండగా, ఈ జాతీయ రహదారిపై అధిక లోడుతో ఇసుక లారీలు నిరంతరం రాకపోకలు సాగించడం వల్ల రహదారి పరిస్థితి దెబ్బతింటోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ వాహనాల రాకపోకల కారణంగా వాహనాల టైర్లు వెళ్లే ప్రాంతాల్లో లోతైన గాడులు, కల్వల మాదిరిగా ఏర్పడ్డాయని చెబుతున్నారు.

ముఖ్యంగా వర్షం కురుస్తున్న సమయంలో ఈ గాడుల్లో నీరు చేరడంతో రహదారి పరిస్థితి స్పష్టంగా కనిపించకపోవడంతో పాటు వాహనాల టైర్లు సరిగా తిరగక, వాహనాలు అదుపుతప్పే ప్రమాదం ఉందని వాహనదారులు పేర్కొంటున్నారు. ఇసుక లారీల అధిక లోడింగ్‌ కారణంగా రహదారిపై ఏర్పడుతున్న ఈ గాడులు చిన్న వాహనాలతో పాటు ఆర్టీసీ బస్సులకు కూడా ప్రమాదకరంగా మారుతున్నాయని చెబుతున్నారు.

ప్రమాదాలు జరగకముందే చర్యలు తీసుకోవాలి

మహాదేవపూర్‌-కాళేశ్వరం జాతీయ రహదారిపై భారీ వాహనాల రాకపోకలను దృష్టిలో పెట్టుకుని రహదారి పరిస్థితిని అధికారులు పరిశీలించాలని స్థానికులు కోరుతున్నారు. అధిక లోడుతో వెళ్తున్న ఇసుక లారీలపై చర్యలు తీసుకోవడంతో పాటు, రహదారిపై ఏర్పడిన గాడులను వెంటనే పూడ్చి మరమ్మతులు చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఇప్పటికే ఆర్టీసీ బస్సు ప్రమాదం తృటిలో తప్పిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమై రహదారి భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని వాహనదారులు, స్థానికులు కోరుతున్నారు. మరో ప్రమాదం జరిగి ప్రాణనష్టం సంభవించకముందే రహదారి సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని వారు పేర్కొంటున్నారు.