Kadiri | పాలిటెక్నిక్ అధ్యాపకుడికి డాక్టరేట్..

Kadiri | శ్రీ సత్య సాయి బ్యూరో, ఆగస్టు 8 (ఆంధ్రప్రభ): పరిశోధనా రంగంలో ప్రతిభ కనబరిచిన కదిరి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ విభాగం అధ్యాపకుడు ఎస్.వి. ప్రతాప్ సింహా రెడ్డికి డాక్టరేట్ లభించింది. అనంతపురం జేఎన్టీయూ యూనివర్సిటీ నుంచి ఆయన డాక్టరేట్ అందుకోవడం పట్ల కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. కదిరి పట్టణంలోని కుటాగుల్లకు చెందిన ప్రతాప్ సింహా రెడ్డి విద్యాబోధనతో పాటు పరిశోధనపై ఆసక్తి కనబరుస్తూ ఈ విజయాన్ని సాధించారు.

ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో వాటిలో ఉపయోగించే బ్యాటరీల సామర్థ్యం, భద్రత, బ్యాటరీపై పడే ఒత్తిడిని తగ్గించడం వంటి అంశాలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ నేపథ్యంలో “ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మోడల్ బేస్డ్ కంట్రోల్ ఆఫ్ హెచ్ఈఎస్ఎస్ ఫర్ బ్యాటరీ స్ట్రెస్ మిటిగేషన్ ఇన్ ఎలక్ట్రిక్ వెహికల్స్” అనే అంశంపై ప్రతాప్ సింహా రెడ్డి పరిశోధన చేపట్టారు. సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం. విజయకుమార్ పర్యవేక్షణలో పరిశోధన పూర్తి చేసి, తన పరిశోధనా సిద్ధాంతాన్ని విశ్వవిద్యాలయానికి సమర్పించారు. పరిశోధనను పరిశీలించిన అనంతరం జేఎన్టీయూ యూనివర్సిటీ ఆయనకు డాక్టరేట్‌ను ప్రదానం చేసింది.

ఎలక్ట్రిక్ వాహనాల్లో బ్యాటరీపై ఒత్తిడిని తగ్గించడంతో పాటు బ్యాటరీ పనితీరును మెరుగుపరిచే నియంత్రణ విధానాలపై ఆయన పరిశోధన సాగింది. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం మరింత విస్తరించే పరిస్థితుల్లో బ్యాటరీ వ్యవస్థల సామర్థ్యం, దీర్ఘకాలిక పనితీరు, నియంత్రణ వ్యవస్థల అభివృద్ధికి ఇటువంటి పరిశోధనలు దోహదపడతాయని అధ్యాపకులు పేర్కొన్నారు.

వరుస డాక్టరేట్లతో కళాశాలకు కీర్తి

కదిరి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన అధ్యాపకులు పరిశోధనా రంగంలో వరుస విజయాలు సాధించడం పట్ల కళాశాల ప్రిన్సిపల్ పి. భాస్కర్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఇదే ఏడాది ఫిజిక్స్ విభాగానికి చెందిన డాక్టర్ జి. రవి డాక్టరేట్ సాధించగా, తాజాగా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన ఎస్.వి. ప్రతాప్ సింహా రెడ్డి డాక్టరేట్ పొందడం గర్వకారణమన్నారు.

అధ్యాపకులు బోధనతో పాటు పరిశోధనలపై దృష్టి సారించడం ద్వారా కళాశాల విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపడటంతో పాటు సంస్థకు మంచి పేరు, ప్రతిష్ఠ లభిస్తాయని ప్రిన్సిపల్ పి. భాస్కర్ పేర్కొన్నారు. వరుసగా ఇద్దరు అధ్యాపకులు డాక్టరేట్‌లు సాధించడం కళాశాల సిబ్బందికి, విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని అన్నారు.

డాక్టరేట్ సాధించిన ఎస్.వి. ప్రతాప్ సింహా రెడ్డిని కళాశాల ప్రిన్సిపల్ పి. భాస్కర్‌తో పాటు అధ్యాపకులు అభినందించారు. ఆయన భవిష్యత్తులో మరిన్ని పరిశోధనలు చేపట్టి విద్యార్థులకు, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ రంగానికి మరింత సేవలందించాలని ఆకాంక్షించారు.