రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

  • మార్కెట్ కమిటీలు రైతులకు అండగా నిలవాలి: ఎమ్మెల్యే గడ్డం వినోద్
  • చైర్మన్‌గా రత్నం సుకుమారి, వైస్ చైర్మన్‌గా రవీందర్ రావు ప్రమాణస్వీకారం
  • క్యాంప్ కార్యాలయం నుండి ఏఎంసీ వరకు భారీ బైక్ ర్యాలీ

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, వ్యవసాయ మార్కెట్ కమిటీలు రైతులకు అండగా నిలుస్తూ గిట్టుబాటు ధరలు, పారదర్శక సేవలు అందించాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి పిలుపునిచ్చారు.

శనివారం బెల్లంపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) నూతన చైర్మన్‌గా రత్నం సుకుమారి, వైస్ చైర్మన్‌గా ఎస్. రవీందర్‌రావుతో పాటు పాలకవర్గ సభ్యుల పదవీ ప్రమాణస్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముందు ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ఏఎంసీ కార్యాలయం వరకు కాంగ్రెస్ శ్రేణులతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మాజీ కేంద్ర మంత్రి, దివంగత ప్రజానేత గడ్డం వెంకటస్వామి (కాకా) విగ్రహానికి, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

తదనంతరం నూతన చైర్మన్, వైస్ చైర్మన్, పాలకవర్గ సభ్యులతో పదవీ ప్రమాణం చేయించి, శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధరలు, పారదర్శక సేవలు, మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా మార్కెట్ కమిటీ పనిచేయాలని సూచించారు. రైతుల ప్రయోజనాలే ధ్యేయంగా నూతన పాలకవర్గం నిబద్ధతతో పనిచేసి బెల్లంపల్లి మార్కెట్ కమిటీని జిల్లాలోనే ఆదర్శవంతమైన సంస్థగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ్ రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ దావ స్వాతి రమేష్‌బాబు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ భాస్కర్, నాయకులు నాతరి స్వామి, కార్కూరి రాంచందర్, రత్నం ప్రదీప్, కొత్తపల్లి శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.