వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి
ఎస్సై టీవీఆర్ సూరి
మంగపేట, ఆంధ్రప్రభ: వాహనదారులు ట్రాఫిక్ నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ములుగు జిల్లా మంగపేట ఎస్సై టీవీఆర్ సూరి సూచించారు. మంగళవారం మంగపేట మండలంలోని బ్రాహ్మణపల్లి చెక్‌పోస్ట్ వద్ద ఎస్సై టీవీఆర్ సూరి ఆధ్వర్యంలో సివిల్, సీఆర్పీఎఫ్ పోలీసులు సంయుక్తంగా వాహనాల తనిఖీ నిర్వహించి వాహనదారులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ప్రతి వాహనదారుడు డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్ తప్పనిసరిగా కలిగి ఉండాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్లరాదని చెప్పారు.
ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా యూనిఫాం ధరించాలని, గూడ్స్ వాహనాల్లో ప్రయాణికులను తీసుకెళ్లకూడదని సూచించారు. అలాగే అతివేగం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయరాదని, మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన ఎస్సై, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో సహకరించాలని కోరారు.
