అర్హులైన రైతులు ఏఈఓలను సంప్రదించాలి
- మండల వ్యవసాయ అధికారి ముత్యాల నాగరాజు వెల్లడి
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : చౌటుప్పల్ మండలం పరిధిలోని 18 రెవెన్యూ గ్రామాలకు చెందిన అర్హులైన రైతులు రైతు భరోసా పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి (ఏఓ) ముత్యాల నాగరాజు ఒక ప్రకటనలో కోరారు. గత 15వ తేదీ నాటికి కొత్తగా పట్టాదార్ పాస్‌బుక్ పొంది, డిజిటల్ సంతకం కలిగి ఉన్న రైతులు ఈ పథకానికి అర్హులని ఆయన పేర్కొన్నారు. అర్హత కలిగిన రైతులు వచ్చే నెల జూలై 5వ తేదీ లోపు తమ పరిధిలోని వ్యవసాయ విస్తరణ అధికారిని (AEO) సంప్రదించి దరఖాస్తు ఫారాలను అందజేయాలన్నారు. అలాగే గతంలో వివిధ కారణాల వల్ల దరఖాస్తు చేసుకోలేకపోయిన రైతులు కూడా ఇప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు.
కావాల్సిన పత్రాలు ఇవే:
దరఖాస్తుతో పాటు రైతులు క్రింది జిరాక్స్ ప్రతులను జతపరచాల్సి ఉంటుంది. భూమి పట్టా పాస్‌బుక్ జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంకు ఖాతా పుస్తకం జిరాక్స్, పూర్తిగా నింపిన రైతు భరోసా దరఖాస్తు ఫారం నిర్ణీత గడువు లోగా రైతులందరూ తమ పరిధిలోని ఏఈఓలకు ఈ పత్రాలను సమర్పించి, రైతు భరోసా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి ముత్యాల నాగరాజు సూచించారు.
