న్యాయ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి..

బిక్కనూర్, ఆంధ్రప్రభ : ప్రతి ఒక్కరూ న్యాయపరమైన చట్టాలు, హక్కులపై అవగాహన కలిగి ఉండాలని కామారెడ్డి జిల్లా సీనియర్ సివిల్ జడ్జి సుర సుమలత అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జంగంపల్లిలోని తెలంగాణ మహాత్మా జ్యోతిబా ఫూలే రెసిడెన్షియల్ స్కూల్‌లో ‘న్యాయాన్ని పొందే హక్కు–ఉచిత న్యాయ సహాయం’ అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సుమలత మాట్లాడుతూ రాజ్యాంగం ప్రతి పౌరుడికి న్యాయం పొందేందుకు సమాన అవకాశాలు కల్పించిందన్నారు.

ఆర్థికంగా వెనుకబడినవారు, మహిళలు, పిల్లలు, ఎస్సీ, ఎస్టీలు, దివ్యాంగులు, అర్హత కలిగిన ఇతరులు ఉచిత న్యాయ సహాయం పొందవచ్చని తెలిపారు. న్యాయం పొందేందుకు డబ్బు అడ్డంకి కాకూడదన్నారు. బాలికలు తమ చట్టపరమైన హక్కులు, బాలల హక్కులు, మహిళల రక్షణకు సంబంధించిన చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. న్యాయపరమైన సమస్యలు ఎదురైతే భయపడకుండా న్యాయ సేవాధికార సంస్థలను సంప్రదించాలని కోరారు.

విద్య, క్రీడలు, ఇతర రంగాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు బహుమతులు, ప్రశంసా పత్రాలను సుమలత అందజేశారు. న్యాయ సహాయం కోసం నాల్సా టోల్‌ఫ్రీ నంబర్ 15100కు ఫోన్ చేయవచ్చని విద్యార్థినులకు వివరించారు. న్యాయ హక్కులు, ఉచిత న్యాయ సహాయానికి సంబంధించిన పోస్టర్లను పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేయాలని పాఠశాల యాజమాన్యాన్ని ఆదేశించారు. కార్యక్రమంలో డీఎల్‌ఎస్‌ఏ కామారెడ్డి మొవ్వ శ్రీనివాస్ రావు, అడ్వకేట్ డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్, పాఠశాల ప్రిన్సిపాల్ రాధిక, న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.