ప్రజలకు మరింత మెరుగైన సేవలు..

  • ఆర్డీవో చేతుల మీదుగా జిపీవో కార్యాలయం ప్రారంభం..

భూపాలపల్లి రూరల్, ఆంధ్రప్రభ : భూపాలపల్లి మండల కేంద్రంలోని తహశీల్దార్‌ కార్యాలయ ఆవరణలో నూతనంగా నిర్మించిన గ్రామ పాలన అధికారుల (జిపీవో) కార్యాలయాన్ని ఆర్డీవో హరికృష్ణ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబరులో ప్రవేశపెట్టిన గ్రామ పాలన అధికారుల వ్యవస్థలో భాగంగా భూపాలపల్లి మండలానికి 17 మంది జిపీవోలను కేటాయించినట్లు తెలిపారు. తహశీల్దార్‌ కార్యాలయంలో జిపీవోలు విధులు నిర్వహించేందుకు తగినన్ని గదులు లేకపోవడంతో ప్రజలకు సేవలు అందించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు.

సమస్యను జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి ప్రత్యేక కార్యాలయ భవనం ఏర్పాటుకు ప్రతిపాదనలు సమర్పించినట్లు తెలిపారు. కలెక్టర్‌ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయడంతో అధికారులు త్వరితగతిన పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొచ్చారని పేర్కొన్నారు. నూతన కార్యాలయం జిపీవోలకు, ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు.

భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసి సహకరించిన జిల్లా కలెక్టర్‌కు ఆర్డీవో, తహశీల్దార్‌, జిపీవోలు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మండల జిపీవోల సంఘం ఆధ్వర్యంలో ఆర్డీవో హరికృష్ణ, తహశీల్దార్‌ లక్ష్మీ రాజయ్య, డిప్యూటీ తహశీల్దార్‌ అంజలి రెడ్డి, పంచాయతీరాజ్‌ ఏఈ నిరంజన్‌, గిర్ధవార్‌ రామస్వామిలను శాలువాలతో ఘనంగా సన్మానించారు.కార్యక్రమంలో జిపీవోల సంఘం మండల అధ్యక్షుడు కుమార్‌, జిల్లా అధ్యక్షుడు జితేందర్‌, ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి, జిపీవోలు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.