పొట్టి శ్రీరాములు, గాంధీ చిత్రపటాలతో శాంతి ర్యాలీ

నర్సాపురం, ఆంధ్రప్రభ: ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని కన్యకా పరమేశ్వరి ఆర్య వైశ్య కళ్యాణ మండపంలో శనివారం జరిగిన వేడుకల్లో పట్టణ పరిసర ప్రాంతాలకు చెందిన ఆర్య వైశ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సంఘ అధ్యక్షుడు ఆత్మూరి నరసయ్య (రిటైర్డ్ తహసీల్దార్), కార్యదర్శి గుడివాడ సాయి రాధాకృష్ణ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు.

మహాత్మా గాంధీ అడుగుజాడల్లో నడుస్తూ దేశ ఖ్యాతిని ఇనుమడింపజేయాలని ఆర్య వైశ్యులకు పిలుపునిచ్చారు. అనంతరం మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తొలుత పొట్టి శ్రీరాములు, మహాత్మా గాంధీ చిత్రపటాలతో పట్టణ పురవీధుల గుండా శాంతి ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో గాదె సూర్య ప్రకాశరావు, ఆత్మూరి బంగారయ్య, కోట్ల బాలకృష్ణ, ఆర్య వైశ్య సంఘంలోని వివిధ విభాగాల ప్రతినిధులు, సంఘ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.