పేదల వైద్యానికి సీఎం సహాయనిధి భరోసా..
ఆముదాలవలస, ఆంధ్రప్రభ : నియోజకవర్గంలో ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) అండగా నిలుస్తోందని ఆముదాలవలస ఎమ్మెల్యే, రాష్ట్ర పీఏసీ చైర్మన్ కూన రవికుమార్ అన్నారు. ఆముదాలవలస నియోజకవర్గానికి చెందిన పలువురు పేద కుటుంబాలకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ ఆర్థిక సహాయ చెక్కులను ఆయన స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పంపిణీ చేశారు.
వివిధ అనారోగ్య సమస్యలతో వైద్య చికిత్స పొందిన కుటుంబాలకు ప్రభుత్వం మంజూరు చేసిన ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే కూన రవికుమార్ అందజేశారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకోవడంతో పాటు కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలపై వైద్య ఖర్చుల భారం తగ్గించేందుకు సీఎంఆర్ఎఫ్ ద్వారా ప్రభుత్వం సహాయం అందిస్తోందని తెలిపారు.
చెక్కులు అందుకున్న లబ్ధిదారుల్లో వంజంగి గ్రామానికి చెందిన అన్నెపు దివ్యకు రూ.66,500, బెండు ధర్మారావుకు రూ.1,26,000, పూజారిపేటకు చెందిన ఇందిరాపు నితిన్కుమార్కు రూ.23,400, పాత ఆముదాలవలసకు చెందిన బండి చంద్రమౌళికి రూ.32,000 చొప్పున మొత్తం రూ.2,47,900 విలువైన చెక్కులను పంపిణీ చేశారు.
పేద ప్రజలకు వైద్య సహాయం అందించడంలో కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని ఎమ్మెల్యే రవికుమార్ తెలిపారు. అత్యవసర వైద్య చికిత్స అవసరమైన పేద కుటుంబాలు ఎప్పుడైనా తనను సంప్రదించవచ్చని చెప్పారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కూన రవికుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
