15 రాష్ట్రపతి పతకాలు ప్రకటన
ముగ్గురికి గ్యాలంట్రీ మెడల్స్..
ఇద్దరికి విశిష్ట సేవా పతకాలు..
మరో 10 మందికి ప్రతిభావంతమైన సేవా పురస్కారాలు
హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ పోలీసు శాఖకు అరుదైన గౌరవం దక్కింది. 2026 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్ర పోలీసు శాఖకు మొత్తం 15 రాష్ట్రపతి పతకాలు ప్రకటించారు. విధి నిర్వహణలో చూపిన ధైర్యసాహసాలు, అంకితభావం, విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ పతకాలను ప్రకటించారు. ఇందులో 3 గ్యాలంట్రీ మెడల్స్, 2 విశిష్ట సేవా పతకాలు, 10 ప్రతిభావంతమైన సేవా పతకాలు ఉన్నాయి.
ముగ్గురు జూనియర్ కమాండోలకు గ్యాలంట్రీ మెడల్స్
వీరత్వానికి ప్రతీకగా అందించే గ్యాలంట్రీ మెడల్స్‌కు తెలంగాణకు చెందిన ముగ్గురు జూనియర్ కమాండోలు ఎంపికయ్యారు. బి. సత్యా రావు, కే. సందీప్ కుమార్, జే. వంశీకృష్ణ ఈ పతకాలను అందుకోనున్నారు. విధి నిర్వహణలో ప్రదర్శించిన ధైర్యసాహసాలు, అసాధారణ తెగువకు గుర్తింపుగా వీరికి ఈ పురస్కారం దక్కింది.
విశిష్ట సేవలకు ఇద్దరికి గౌరవం
దీర్ఘకాలంగా అత్యుత్తమ సేవలు అందించిన పోలీసు సిబ్బందికి ఇచ్చే విశిష్ట సేవా పతకాల విభాగంలో తెలంగాణ నుంచి ఇద్దరిని ఎంపిక చేశారు. విధి నిర్వహణలో నిబద్ధత, సమర్థత, సేవా ప్రస్థానాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు.
మరో 10 మందికి ప్రతిభావంతమైన సేవా పతకాలు
ఇక పోలీసు విధుల్లో ప్రతిభ, అంకితభావం, నిరంతర సేవలను గుర్తిస్తూ మరో 10 మందికి మెరిటోరియస్ సర్వీస్ మెడల్స్ ప్రకటించారు. దీంతో తెలంగాణ పోలీసు శాఖకు ఈసారి మొత్తం 15 పతకాలు దక్కాయి.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పురస్కారాలు
ప్రతి ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవం సందర్భంగా పోలీసు, అగ్నిమాపక, హోంగార్డ్స్, పౌర రక్షణ, కారాగార సేవల సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం వివిధ విభాగాల్లో పతకాలను ప్రకటిస్తుంది. వీరత్వానికి గ్యాలంట్రీ మెడల్, అత్యుత్తమ దీర్ఘకాల సేవలకు విశిష్ట సేవా పతకం, ప్రతిభావంతమైన సేవలకు మెరిటోరియస్ సర్వీస్ మెడల్ అందిస్తారు.
