గోదావరి పుష్కరాలకు ప్రత్యేక పడవలు.. భక్తుల కోసం భారీ భద్రతా ఏర్పాట్లు
- నది మధ్యలో పుణ్యస్నానానికి ప్రత్యేక పుష్కర పడవలు
- 300కు పైగా పడవలతో సరికొత్త ఆధ్యాత్మిక అనుభూతి
- భక్తుల భద్రతకు 100కు పైగా రెస్క్యూ బృందాలు
- ప్రతి పడవలో లైఫ్ జాకెట్లు, భద్రతా పరికరాలు
- ప్రమాదాల నివారణకు నిఘా టవర్లు, బారికేడ్లు
- రెండు నిమిషాల్లో స్పందించేలా రెస్క్యూ కార్యాచరణ
- 350 ప్రత్యేక పడవలతో పుష్కరాలకు భారీ ఏర్పాట్లు
అమరావతి, ఆంధ్రప్రభ : గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు ఈసారి సరికొత్త ఆధ్యాత్మిక అనుభూతిని అందించేందుకు ప్రత్యేక పుష్కర పడవలను సిద్ధం చేస్తున్నారు. రాజమహేంద్రవరం, ధవళేశ్వరం ప్రాంతాల్లో సుమారు 300కు పైగా చెక్క పడవలను సంప్రదాయ శైలిలో తయారు చేస్తున్నారు. దేవతా విగ్రహాలు, గోపుర ఆకృతులు, పసుపు-కుంకుమ రంగులు, మామిడి తోరణాలు, పూలదండలు, జెండాలతో వీటిని అలంకరించనున్నారు. భక్తులను నది మధ్యలోకి తీసుకెళ్లి పుణ్యస్నానం, పితృతర్పణం, శ్రాద్ధ కర్మలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
పుష్కరాల సందర్భంగా సుమారు రెండు కోట్ల మంది భక్తులు గోదావరిని దర్శించనున్న నేపథ్యంలో ఘాట్ల వద్ద రద్దీ, తొక్కిసలాట, ప్రమాదాలను తగ్గించేందుకు ఈ పడవలను వినియోగించనున్నారు. భక్తులను గ్రూపుల వారీగా నది మధ్యలోకి తీసుకెళ్లడం ద్వారా స్నానాలు క్రమబద్ధంగా నిర్వహించడంతో పాటు ఘాట్లపై ఒత్తిడి తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. గోదావరి మధ్య భాగంలో స్నానం, పితృతర్పణం చేయడం విశేష పుణ్యఫలాన్ని ఇస్తుందనే విశ్వాసం ఉండటంతో ఈ పడవలకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది.
100కు పైగా రెస్క్యూ బృందాలు..
భక్తుల భద్రతకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ప్రతి పుష్కర పడవలో లైఫ్ జాకెట్లు, శిక్షణ పొందిన సిబ్బంది, అవసరమైన భద్రతా పరికరాలను అందుబాటులో ఉంచనున్నారు. ఘాట్ల వద్ద ప్రత్యేక నిఘా టవర్ల నుంచి బైనాక్యులర్లతో నది పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తారు. ఎవరైనా ప్రమాదంలో చిక్కుకున్నట్లయితే రెండు నిమిషాల్లోనే రెస్క్యూ బృందాలు స్పందించేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. లోతైన ప్రాంతాల్లోకి భక్తులు వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు ప్రజల్లో అవగాహన కూడా కల్పించనున్నారు.
పుష్కరాలు ప్రారంభానికి నెల రోజుల ముందే రెస్క్యూ బృందాలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. అలాగే ప్రతి పడవ వెంట ఒక గజ ఈతగాళ్ల బృందం సభ్యుడు తప్పనిసరిగా ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. పుష్కరాల సమయంలో నీటిలో జరిగే ప్రమాదాలను నివారించేందుకు 100కు పైగా గజ ఈతగాళ్ల (రెస్క్యూ) బృందాలను రంగంలోకి దించనున్నారు.
ఈ బృందాల్లో నైపుణ్యం కలిగిన ఈతగాళ్లు, మత్స్యకారులు, బోటు నడపడంలో శిక్షణ పొందిన పోలీసులు, విపత్తు నిర్వహణ నిపుణులు ఉంటారు. లైఫ్ బోయాలు, లైఫ్ జాకెట్లు, రోప్ త్రో బ్యాగులు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు, సెర్చ్ లైట్లు, మోటార్ బోట్లు వంటి ఆధునిక పరికరాలతో వీరు సిద్ధంగా ఉంటారు. సమన్వయంతో పనిచేసే 10 నుంచి 15 మంది సభ్యులతో కూడిన ఈ రెస్క్యూ బృందాలు వైర్లెస్ కమ్యూనికేషన్ వ్యవస్థతో సేవలందించనున్నాయి.
ఈసారి పుష్కరాల్లో సుమారు 350 ప్రత్యేక పుష్కర పడవలు, వాటి భద్రత కోసం 100కు పైగా గజ ఈతగాళ్ల బృందాలు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతితో పాటు సురక్షిత పుష్కర స్నానాన్ని అందించడమే ఈ ఏర్పాట్ల ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు.
