స్వాతంత్ర్య వేడుకలను పకడ్బందీగా నిర్వహించాలి
ఎలాంటి లోపాలు ఉండకూడదు: అడిషనల్ ఎస్పీ రోహిత్‌కుమార్ చౌదరి
నరసరావుపేట, ఆంధ్రప్రభ: ఆగస్టు 15న నిర్వహించనున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో సమిష్టిగా కృషి చేయాలని జిల్లా అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) రోహిత్‌కుమార్ చౌదరి సూచించారు. స్థానిక పోలీస్ పరేడ్ మైదానంలో శుక్రవారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల భద్రతా ఏర్పాట్లు, బందోబస్తు, పరేడ్ రిహార్సల్స్‌ను ఆయన పరిశీలించారు. రిహార్సల్‌లో భాగంగా వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పరేడ్ పరిశీలన వాహనంలో వెళ్లి సాయుధ పోలీసు బలగాల కవాతును పరిశీలించారు. కవాతు బృందాల క్రమశిక్షణ, సమన్వయం, పరేడ్ నిర్వహణ తదితర అంశాలను పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.
ఆగస్టు 15న జరిగే ప్రధాన కార్యక్రమానికి హాజరయ్యే ప్రముఖులు, స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబ సభ్యులు, ఉన్నతాధికారులు, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన భద్రతా చర్యలు, మౌలిక సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. వేడుకలు ప్రారంభం నుంచి ముగింపు వరకు ప్రతి అంశాన్ని ముందస్తుగా సమీక్షించి, ఎలాంటి సమస్యలకు తావులేకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజలకు రాకపోకల్లో ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. అనంతరం పోలీసు జాగిలాల ప్రత్యేక ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమాన్ని సమన్వయంతో, సమిష్టి కృషితో విజయవంతం చేయాలని పోలీసు అధికారులు, సిబ్బందికి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ గాంధీరెడ్డి, ఏఆర్ ఇన్‌స్పెక్టర్లు కృష్ణ, గోపీనాథ్, యువరాజు, రాజు తదితరులు పాల్గొన్నారు.
