సాగర్‌ ఎడమ కాలువకు వెంటనే నీరు విడుదల చేయాలి

గరిడేపల్లి, ఆంధ్రప్రభ: వర్షాభావ పరిస్థితులతో సాగర్‌ ఎడమ కాలువ పరిధిలోని రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీఆర్‌ఎస్‌ నాయకులు విమర్శించారు. శుక్రవారం గరిడేపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో హుజూర్‌నగర్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ కడియం వెంకట్‌రెడ్డి మాట్లాడారు. ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు కురవక బోర్లు, బావులు ఎండిపోవడంతో రైతులు సాగునీటి కొరతను ఎదుర్కొంటున్నారని తెలిపారు. సాగర్‌ ఎడమ కాలువకు వెంటనే నీటిని విడుదల చేసి చెరువులు, కుంటలను నింపాలని డిమాండ్‌ చేశారు.

ఒకవైపు శ్రీశైలం–పోతిరెడ్డిపాడు మార్గం ద్వారా రాయలసీమకు నీటి తరలింపుపై ఆరోపణలు వస్తున్నాయని, తెలంగాణ రైతుల పంటలకు సాగునీరు అందించడంలో ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం వహిస్తోందని ప్రశ్నించారు. ‘అక్కడికి నీళ్లు.. ఇక్కడికి కన్నీళ్లా?’ అని వ్యాఖ్యానించిన ఆయన, ఎడమ కాలువ కింద ఇప్పటికే నాట్లు వేసిన పంటలకు సకాలంలో నీరు అందకపోతే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. కాలువకు విడతల వారీగా నీటిని విడుదల చేసి చెరువులు, కుంటలను నింపితే భూగర్భ జలాలు పెరగడంతో పాటు తాగునీరు, పశువుల నీటి సమస్యలు కూడా పరిష్కారమవుతాయని పేర్కొన్నారు. రైతుల సమస్యను అత్యవసర అంశంగా పరిగణించి ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సాగర్‌ ఎడమ కాలువకు నీటిని విడుదల చేయకపోతే రైతాంగంతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీలు కడియం స్వప్న వెంకటరెడ్డి, పెండెం వీరయ్యగౌడ్‌, మాజీ మండల ప్రధాన కార్యదర్శి మన్సూర్‌ అలీ, పెండెం ధనయ్యగౌడ్‌, వెంకటరాముడు గౌడ్‌, అమరగాని వెంకటేశ్వర్లు గౌడ్‌, ప్రధాని సైదులు ముదిరాజ్‌, శేషిరెడ్డి, రాజ్‌ మహమ్మద్‌, గోపాల్‌, మామిడి కాశయ్య, అంజయ్య, రెబ్బ శివ, వేణు, పిట్ట నర్సయ్య, చిట్యాల లింగయ్య, పెండెం శ్రీను, పెండెం వినోద్‌, పెండెం శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.