బోడుప్పల్లో రూ.6 కోట్ల స్థలాలపై కన్ను.. గుడి, పార్కు స్థలాల కబ్జాకు స్కెచ్?
- తిరుమల మెడోస్‌లో గుడి, పార్కు స్థలాలపై వివాదం
- రూ.6 కోట్ల విలువైన స్థలాలపై భూకబ్జాదారుల కన్ను?
- మైసమ్మ గుడి స్థలం విక్రయానికి యత్నించారన్న ఆరోపణలు
- అమ్మిన వారిపై కేసు.. కొనుగోలుదారుల సంగతేంటి?
- లేఅవుట్ రికార్డులు, రిజిస్ట్రేషన్ పత్రాలపై విచారణకు డిమాండ్
- రాజకీయ జోక్యంపై ఆరోపణలు.. నిజానిజాలు తేల్చాలని కోరుతున్న కాలనీవాసులు
- గుడి, పార్కు స్థలాలను కాపాడుకుంటామని హెచ్చరిక
- ఉన్నతస్థాయి దర్యాప్తు చేపట్టాలని డిమాండ్
- కబ్జా వ్యవహారంలో ఎంతటి వారైనా వదలొద్దు: మీసాల కృష్ణ
బోడుప్పల్‌లోని తిరుమల మెడోస్ కాలనీలో గుడి, పార్కు కోసం కేటాయించిన కోట్ల విలువైన స్థలాలపై వివాదం ముదురుతోంది. ఏళ్లుగా పూజలు అందుకుంటున్న మైసమ్మ గుడి స్థలంతో పాటు పార్కు స్థలాన్ని విక్రయించేందుకు ప్రయత్నాలు జరిగాయన్న ఆరోపణలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. కాలనీవాసుల ఫిర్యాదుతో అధికారులు కేసు నమోదు చేసినప్పటికీ, విక్రేతలతో పాటు కొనుగోలుదారుల పాత్రపైనా సమగ్ర విచారణ జరపాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఈ వ్యవహారం వెనుక అసలు ఏం జరిగింది? కోట్ల విలువైన ప్రజా అవసరాల స్థలాలపై ఎవరి కన్ను పడింది? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
బోడుప్పల్, ఆగస్టు 13 (ఆంధ్రప్రభ): బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని తిరుమల మెడోస్ కాలనీ లేఅవుట్లో గుడి, పార్కు కోసం కేటాయించిన స్థలాలపై భూకబ్జాదారుల కన్నుపడిందన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. సుమారు రూ.ఆరు కోట్ల విలువైన ఈ స్థలాలను సొంతం చేసుకునేందుకు పక్కా ప్రణాళికతో వ్యవహారం నడిపారని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. ఏళ్లుగా స్థానికులు పూజలు నిర్వహిస్తున్న మైసమ్మ అమ్మవారి గుడి స్థలంతోపాటు పార్కు కోసం కేటాయించిన స్థలాన్ని విక్రయించేందుకు రంగం సిద్ధం చేశారన్న ఆరోపణలు వెలుగులోకి రావడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజా అవసరాల కోసం వదిలిన స్థలాలపై వ్యక్తిగత హక్కులు ఎలా ఏర్పడ్డాయన్న ప్రశ్న స్థానికుల నుంచి వ్యక్తమవుతోంది. కాలనీవాసుల ఫిర్యాదుతో అధికారులు స్పందించి స్థలాలను విక్రయించిన వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిసింది. అయితే కొనుగోలు చేసిన వారు కూడా అదే కాలనీకి చెందిన వారేనని స్థానికులు చెబుతుండటంతో ఈ వ్యవహారంలో మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాలనీ లేఅవుట్ స్వరూపం, గుడి చరిత్ర, పార్కు స్థలం గురించి తెలిసిన వ్యక్తులు వాటిని కొనుగోలు చేయడానికి ముందుకు రావడం వెనుక ఉద్దేశమేమిటన్నది తేలాల్సి ఉందని కాలనీవాసులు అంటున్నారు.
కాలనీ లేఅవుట్లో గుడి.. పార్కు అని స్పష్టంగా ఉన్నా!
తిరుమల మెడోస్ కాలనీ లేఅవుట్ పత్రాల్లో గుడి, పార్కు కోసం స్థలాలు కేటాయించినట్లు కాలనీవాసులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన పత్రాలు తమ వద్ద ఉన్నాయని, అవసరమైన సమయంలో అధికారులకు అందజేస్తామంటున్నారు. ప్రజా అవసరాల కోసం కేటాయించిన స్థలాలను క్రయవిక్రయాలు చేసేందుకు ఎవరికి అధికారం ఉందని వారు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ రిజిస్ట్రేషన్ జరిగి ఉంటే ఏ పత్రాల ఆధారంగా జరిగింది? ఎవరి అనుమతులతో లావాదేవీలు సాగాయనే అంశాలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.
రూ.కోట్ల విలువైన స్థలాలపై కన్ను
భవిష్యత్‌లో స్థలాల విలువ మరింత పెరిగే అవకాశం ఉండటంతోనే ముందస్తు ప్రణాళికతో వాటిని దక్కించుకునే ప్రయత్నం జరిగిందన్న ప్రచారం కాలనీలో వినిపిస్తోంది. రాజకీయ నేతల అండదండలతోనే ఈ వ్యవహారం నడిచిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే రాజకీయ నాయకుల ప్రమేయంపై వస్తున్న ఆరోపణలు నిజమా కాదా అన్నది అధికారుల సమగ్ర దర్యాప్తులో తేలాల్సి ఉంది. ప్రజా ప్రయోజనాల కోసం కేటాయించిన స్థలాలు వ్యక్తిగత చేతుల్లోకి వెళ్లకుండా అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
కొనుగోలుదారులు కూడా కాలనీ వాసులే!
ఈ వ్యవహారంలో కొనుగోలు చేసిన వారు కూడా కాలనీకి చెందిన వారేనని స్థానికులు చెబుతుండటం చర్చనీయాంశంగా మారింది. ఏళ్లుగా ఉన్న మైసమ్మ గుడి, అక్కడ జరిగే పూజలు, లేఅవుట్లోని పార్కు స్థలం గురించి వారికి తెలియకుండా ఉండే అవకాశమే లేదని వారు అంటున్నారు. తెలిసే కొనుగోలు చేశారా, లేక తెలియక చేశారా అన్నది పత్రాలు, సాక్ష్యాలు, లావాదేవీల ఆధారంగా అధికారులు తేల్చాలని కోరుతున్నారు.
అమ్మిన వారిపై కేసు.. మరి కొనుగోలుదారుల సంగతేంటి?
తిరుమల మెడోస్ కాలనీలోని మైసమ్మ గుడి, పార్కు స్థలాలకు సంబంధించిన పూర్తి రికార్డులను అధికారులు పరిశీలించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. స్థలం ఎవరి పేరుపై ఉంది? లేఅవుట్లో దాని కేటాయింపు ఏమిటి? విక్రయానికి ఎవరు ప్రయత్నించారు? కొనుగోలుదారులు ఎవరు? మధ్యవర్తులెవరు? డబ్బు లావాదేవీలు ఎలా జరిగాయి? రిజిస్ట్రేషన్ జరిగిందా? వంటి ప్రతి అంశాన్ని దర్యాప్తులోకి తీసుకోవాలని కోరుతున్నారు.
తమ వద్ద ఉన్న లేఅవుట్ పత్రాలు, స్థల కేటాయింపు వివరాలు, విక్రయ, కొనుగోలు పత్రాలు, రిజిస్ట్రేషన్ వివరాలు తదితర ఆధారాలను అధికారుల ముందు ఉంచేందుకు సిద్ధంగా ఉన్నామని కాలనీవాసులు స్పష్టం చేస్తున్నారు. గుడి, పార్కు స్థలాలను పరిరక్షించడంతో పాటు వాటి వెనుక ఉన్న లావాదేవీల పూర్తి వివరాలను వెలుగులోకి తేవాలని కోరుతున్నారు.
కాలనీవాసుల ఫిర్యాదుతో విక్రయించిన వారిపై కేసు నమోదు చేసినప్పటికీ, కొనుగోలుదారులపై అదే స్థాయిలో విచారణ జరగకపోవడంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఒక క్రయవిక్రయ వ్యవహారంలో విక్రేతతో పాటు కొనుగోలుదారుడి పాత్రను కూడా పరిశీలించాల్సి ఉంటుందని అంటున్నారు. కేవలం ఒక వర్గంపై చర్యలు తీసుకుని మరో వర్గాన్ని వదిలేయడం పలు అనుమానాలకు తావిస్తోందని ఆరోపిస్తున్నారు.
రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే కొనుగోలుదారులపై చర్యలు తీసుకోవడం లేదన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈ వ్యవహారంలో ఎవరైనా రాజకీయ నాయకుల వద్దకు వెళ్లి తమకు అనుకూలంగా చర్యలు తీసుకునేలా ప్రయత్నించారా? అధికారులపై ఒత్తిడి తెచ్చారా? చర్యలు మధ్యలోనే ఎందుకు నిలిచిపోయాయన్న అంశాలను ఉన్నతాధికారులు పరిశీలించాలని కాలనీవాసులు కోరుతున్నారు.
దారులు కూడా తిరుమల మెడోస్ కాలనీకి చెందిన వారే!
ఇదిలా ఉండగా సుమారు 300 గజాల స్థలానికి సంబంధించిన వ్యవహారం బయటపడటంతో పెద్దల సమక్షంలో దానిని రద్దు చేసుకుంటామని చెప్పినట్లు సమాచారం. అయితే మిగిలిన సుమారు 700 గజాలను బంధువుల పేర్లపై మార్చుకుని, తాము లక్షల్లో నష్టపోయామని చెబుతూ వ్యవహారాన్ని సద్దుమణిగేలా చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ ఆరోపణలపై కూడా అధికారులు పూర్తిస్థాయి విచారణ జరపాలని స్థానికులు కోరుతున్నారు.
భూకబ్జాదారులను వదిలే ప్రసక్తే లేదని కాలనీవాసులు స్పష్టం చేస్తున్నారు. మైసమ్మ గుడి, పార్కు స్థలాలను కాపాడుకునే విషయంలో వెనక్కి తగ్గేది లేదని చెబుతున్నారు. ఏళ్లుగా పూజలు జరుగుతున్న గుడి స్థలాన్ని కబ్జా చేసుకునే ప్రయత్నాలను సహించబోమన్నారు. కాలనీ ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసాలకు, సామూహిక అవసరాలకు సంబంధించిన స్థలాలను కాపాడుకోవడం తమ బాధ్యత అని పేర్కొన్నారు.
ఉన్నతస్థాయి దర్యాప్తే పరిష్కారం
ఈ వివాదాన్ని స్థానిక స్థాయిలోనే ముగించకుండా ఉన్నతాధికారులు పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు. లేఅవుట్ రికార్డుల నుంచి రిజిస్ట్రేషన్ పత్రాల వరకు, కొనుగోళ్లు, విక్రయ లావాదేవీల నుంచి కొనుగోలుదారుల పాత్ర వరకు, మధ్యవర్తుల వ్యవహారం నుంచి రాజకీయ జోక్యం వరకు ప్రతి కోణాన్ని పరిశీలించాలని కోరుతున్నారు.
మైసమ్మ గుడి, పార్కు కోసం కేటాయించిన స్థలాన్ని తక్షణమే పరిరక్షించి, భవిష్యత్‌లో ఎలాంటి క్రయవిక్రయాలకు అవకాశం లేకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఎంతటి వారినైనా వదిలిపెట్టొద్దని కోరుతున్నారు.
గుడి, పార్కు స్థలాల కబ్జాపై చర్యలు తీసుకోవాలి: మీసాల కృష్ణ
తిరుమల మెడోస్ కాలనీలో స్థలాన్ని కబ్జా చేయడం సిగ్గుచేటు అని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి మీసాల కృష్ణ అన్నారు. దేవుడి భూమినే కబ్జా చేస్తున్నారంటే ప్రజలకు సంబంధించిన స్థలాలకు రక్షణ లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గుడి, పార్కు స్థలాన్ని విక్రయించిన వారితో పాటు కొనుగోలు చేసిన వారిపైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.
ఎంతటి వారైనా కబ్జా వ్యవహారంలో ఉన్నట్లయితే వదిలిపెట్టకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాపాడుకోవడం తమ బాధ్యత అన్నారు. ఈ వ్యవహారంలో ఎవరి ప్రమేయం ఉన్నా ఆధారాలతో బయటపెడతామని, తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు.
