తండ్రిని కత్తితో పొడిచి చంపిన తనయుడు…
శ్రీరంగరాజపురం, ఆగస్టు 14 (ఆంధ్రప్రభ): మద్యం మత్తులో పెన్షన్ డబ్బుల కోసం తండ్రితో జరిగిన గొడవ చివరకు హత్యకు దారితీసింది. నిద్రిస్తున్న తండ్రిపై కుమారుడు కత్తితో దాడి చేసి హతమార్చిన ఘటన శ్రీరంగరాజపురం మండలం క్షీరసముద్రం గ్రామంలో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
క్షీరసముద్రం గ్రామానికి చెందిన ఆనంద్ (45) వికలాంగుడు. సుమారు 25 సంవత్సరాల క్రితం బంధువుల అమ్మాయిని వివాహం చేసుకున్న ఆయనకు ఇద్దరు కుమారులున్నారు. కొంతకాలంగా కుటుంబ కలహాల కారణంగా భార్య, పిల్లలు ఆయనకు దూరంగా ఉంటున్నట్లు తెలిసింది. పెద్ద కుమారుడు జ్యోతిశ్వరన్ మద్యానికి బానిసై తరచూ తండ్రితో గొడవ పడేవాడని స్థానికులు తెలిపారు. సుమారు పదేళ్ల క్రితం తల్లిదండ్రులను వదిలి చిత్తూరులో కాపురం పెట్టినట్లు సమాచారం.
ఈ క్రమంలో గత రాత్రి జ్యోతిశ్వరన్ తండ్రి వద్దకు వచ్చాడు. మద్యం సేవించిన అనంతరం తనకు పెన్షన్ డబ్బులు ఇవ్వాలని తండ్రిని కోరాడు. ఈ విషయమై తండ్రి, కుమారుడి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం ఆనంద్ నిద్రలోకి జారుకున్న సమయంలో జ్యోతిశ్వరన్ కత్తితో ఆయనపై దాడి చేశాడు. శరీరంలోని పలు ప్రాంతాల్లో సుమారు ఐదు చోట్ల కత్తిపోట్లు పడటంతో ఆనంద్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది.
తండ్రిపై దాడి చేసిన అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారయ్యే క్రమంలో 108కు ఫోన్ చేసి సమాచారం అందించినట్లు పోలీసులు తెలిపారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన అత్తపైనా జ్యోతిశ్వరన్ దాడి చేసినట్లు సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసులు నిందితుడు జ్యోతిశ్వరన్ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. హత్యకు దారితీసిన పూర్తి కారణాలు, కుటుంబ వివాదాలు, పెన్షన్ డబ్బుల విషయంలో జరిగిన గొడవ తదితర అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
