ఆంధ్రప్రభ ఎఫెక్ట్…
- పంచాయతీ కార్యదర్శి అక్రమాలు వాస్తవమే
- ఆంధ్రప్రభ కథనంతో కదిలిన యంత్రాంగం
- డెత్ సర్టిఫికెట్ల జారీలో అధికార దుర్వినియోగంపై అధికారుల విచారణ
- బొమ్మనపల్లి పంచాయతీలో రికార్డుల తనిఖీ
- ఐదుగురికి వేర్వేరు తేదీల్లో ధ్రువపత్రాల జారీపై నిర్ధారణ
- డివిజనల్ పంచాయతీ అధికారి వెంకటప్రసాద్
అచ్చంపేట, ఆంధ్రప్రభ : ఒకే వ్యక్తికి వేర్వేరు తేదీలతో డెత్ సర్టిఫికెట్లు జారీ చేసిన వ్యవహారంపై ఈనెల 8న ఆంధ్రప్రభలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం బొమ్మనపల్లిలో డీఎల్‌పీవో వెంకట ప్రసాద్ విచారణ నిర్వహించారు.
ఈ సందర్భంగా డెత్ సర్టిఫికెట్ల జారీకి సంబంధించిన రిజిస్టర్లు, రికార్డులను ఆయన పరిశీలించారు. విచారణలో ఐదుగురు వ్యక్తులకు వేర్వేరు తేదీల్లో పంచాయతీ కార్యదర్శి రమేష్ అధికార దుర్వినియోగానికి పాల్పడి డెత్ సర్టిఫికెట్లు జారీ చేసినట్లు గుర్తించినట్లు డీఎల్‌పీవో వెంకట ప్రసాద్ తెలిపారు.
సంబంధిత వివరాలను నమోదు చేసుకుని, దరఖాస్తులు, రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. పూర్తి స్థాయి నివేదికను జిల్లా పంచాయతీ అధికారికి సమర్పించనున్నట్లు వెల్లడించారు.
నివేదిక ఆధారంగా చర్యలు
డెత్ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియలో జరిగిన లోపాలపై సమగ్రంగా పరిశీలించి నివేదిక రూపొందించనున్నట్లు అధికారులు తెలిపారు. నివేదికను డీపీవోకు అందజేసిన అనంతరం తదుపరి చర్యలకు సిఫారసు చేస్తామని డీఎల్‌పీవో స్పష్టం చేశారు.
కథనంతో అధికారుల్లో కదలిక
ఒకే వ్యక్తికి రెండుసార్లు డెత్ సర్టిఫికెట్ జారీ చేసిన వ్యవహారంపై ఆంధ్రప్రభలో ప్రచురితమైన కథనం అధికారుల్లో స్పందనకు దారితీసింది. దీంతో పంచాయతీ రికార్డులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అధికారులు.. ఐదుగురికి వేర్వేరు తేదీల్లో డెత్ సర్టిఫికెట్లు జారీ అయిన విషయాన్ని గుర్తించినట్లు తెలిపారు. తదుపరి విచారణలో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
