హైదరాబాద్ : టాలీవుడ్ లో థియేటర్ల మూసివేతపై పెద్ద రగడ సాగుతోంది. తనకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారంటూ పవన్ కల్యాణ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఓ నలుగురు నిర్మాతలు కలిసి పవన్ సినిమాను అడ్డుకుంటున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలోనే అల్లు అరవింద్ సంచలన ప్రెస్ మీట్ నిర్వహించారు. కొన్ని రోజులుగా వినిపిస్తున్న అనేక రూమర్లపై ఆయన తాజాగా స్పందించారు. ‘కొన్ని రోజులుగా ఆ నలుగురు.. ఆ నలుగురు అంటున్నారు. నేను ఆ నలుగురిలో లేను. ఆ నలుగురి వ్యాపారంలోనేను లేను. ఆ నలుగురు తర్వాత పది మంది అయ్యారు. కొవిడ్ టైమ్ లోనే నేను బయటకు వచ్చాను. తెలంగాణలో నాకు ఒక్క థియేటర్ కూడా లేదు. తెలంగాణలో నాకు ఉన్నది త్రిబుల్ ఏ మాత్రమే. తెలంగాణలో నా దగ్గర ఒక్కటి లీజుకు లేదు.
ఏపీలో కొన్ని మాత్రమే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా కలిపి 15లోపు థియేటర్లు మాత్రమే ఉన్నాయి. పాత అలవాటు కొద్ది నన్ను ఆ నలుగురిలో నన్ను కలిపేస్తున్నారు. ఆ నలుగురిలో నన్ను కలపకండి.
1500 థియేటర్లకు నా వద్ద 15 మాత్రమే ఉన్నాయి. ఈ థియేటర్ల మూసివేత విషయంపై ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ నిర్ణయం సమంజసమైందే. ఈ థియేటర్లకు సంబంధించిన మీటింగ్ కు నేను వెళ్లలేదు. నాకు ఇష్టం లేదు. మా గీతా ఫిలిమ్స్ ప్రొడ్యూసర్లను కూడా వెళ్లొద్దని చెప్పాను
.థియేటర్లకు కష్టాలు ఉన్నాయి. వాటిని ఛాంబర్, గిల్డ్ తో డిస్కషన్ చేసుకుంటే బాగుండేది. కుదరకపోతే ప్రభుత్వం వద్దకు అయినా వెళ్లాల్సి ఉండేది. కానీ అవేవీ చేయకుండానే మూసేస్తామని ఏకపక్షంగా చెప్పారు. అందుకే నాకు చిరాకు కలిగి నేను వెళ్లలేదు.
పవన్ కల్యాణ్ సినిమా రిలీజ్ అవుతుండగా మూసేయడం దుస్సాహసమే. దానికి ముందడుగు వేయకూడదు. పవన్ కు ఎదురెళ్ల కూడదు. ఇండస్ట్రీ నుంచి ఏం అడిగినా పవన్ కల్యాణ్ హెల్ప్ చేస్తున్నారు. మేం నిర్మాతలుమొదట్లో పవన్ వద్దకు వెళ్లినప్పుడు చంద్రబాబు గారిని మర్యాదపూర్వకంగా కలవండి అని చెప్పారు. కానీ ఎవరూ వెళ్లలేదు. నేను అడిగినా సరే నిర్మాతలు వెళ్లి కలవలేదు.ప్రభుత్వంతో మాకేంటి సంబంధం అని కొందరు నిర్మాతలు అంటున్నారు. అలా అవసరమే లేనప్పుడు అంత పెద్ద పెద్ద వాళ్లు వెళ్లి గత సీఎంను ఎందుకు కలిశారు. మరి ఇప్పుడు ఎందుకు కలవట్లేదు.
ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత మన బాధ్యతగా వెళ్లి కలవాలి. వాళ్లు మనకోసం అన్నీ రకాలుగా హెల్ప్ చేస్తున్నారు. కానీ నిర్మాతలు మాత్రం ఎవరికి వారు వెళ్లి కలుస్తూ పనులు చేసుకుంటున్నారు. ఎగ్జిబిటర్లకు నిజంగానే సమస్యలు ఉన్నాయి. కాదనట్లేదు.కానీ వారు ముందుగా ఛాంబర్, గిల్డ్ లో డిస్కషన్ చేసినా సరే సమస్యలు పరిష్కారం కాకపోతే.. అప్పుడు ప్రభుత్వం వద్దకు వెళ్లాల్సింది.
అంతే గానీ ఏకపక్షంగా థియేటర్లు మూసేస్తామని చెప్పారు. ఇండస్ట్రీకి ఎంతో చేస్తున్న పవన్ కల్యాణ్ గారి సినిమా ఉండగా.. ఇలా మూసేస్తామని చెప్పడం కరెక్ట్ కాదు. అది పవన్ కల్యాణ్ ను బెదిరించడమే అవుతుంది. పవన్ కల్యాణ్ బాధపడటం కరెక్ట్ . వాళ్ల నిర్ణయం నాకు నచ్చలేదు కాబట్టే వెళ్లలేదు. ఈ విషయాల్లోకి నన్ను లాగకండి. నాపై వార్తలు రాయకండి’ అంటూ చెప్పుకొచ్చారు అల్లు అరవింద్.