ఈద్గా ప్రహరీ గోడ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి శ్రీహరి

మక్తల్, ఆంధ్రప్రభ: ప్రజా ప్రభుత్వంలో అన్ని వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నామని, కులమతాలకు అతీతంగా మక్తల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే తమ లక్ష్యమని రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి అన్నారు. బుధవారం మక్తల్ పట్టణంలోని ఈద్గా వద్ద రూ.36 లక్షల వ్యయంతో నిర్మించనున్న ప్రహరీ గోడ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 73 ఏళ్ల తర్వాత మక్తల్ ప్రాంత ప్రజలకు సేవ చేసే అవకాశం లభించడం తన అదృష్టమని అన్నారు. ప్రార్థనా మందిరాల అభివృద్ధి, సంరక్షణ అందరి బాధ్యత అని పేర్కొన్నారు. మక్తల్ ప్రాంతం అన్ని రంగాల్లో వెనుకబడిందని, దానిని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అన్ని కులాలు, మతాల ప్రజలు సమానంగా అభివృద్ధి చెందాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు.

కులాలు, మతాల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టాలని మంత్రి పిలుపునిచ్చారు. ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు ఉంటాయని, ఇప్పుడు అందరి దృష్టి మక్తల్ అభివృద్ధిపైనే ఉండాలని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ వాకిటి మానస హన్మంతు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు బోయ రవికుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, మైనార్టీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.