వైసీపీ ఓడిపోయే మొదటి సీటు మచిలీపట్నమే – ఎంపీ బాలశౌరి

వైసీపీ ఓడిపోయే మొదటి సీటు మచిలీపట్నమే – ఎంపీ బాలశౌరి

మచిలీపట్నం, ఆంధ్రప్రభ : 2029 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయే మొదటి సీటు మచిలీపట్నమే అవుతుందని బందరు పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి తీవ్రంగా విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే చేసిన దుర్మార్గమైన రాజకీయాలే ఇందుకు ప్రధాన కారణమని ఆయన ఎద్దేవా చేశారు. కొంత మంది వ్యక్తిగత కక్షలతో ప్రజల అభివృద్ధిని అడ్డుకొని రాక్షసానందం పొందారని, అందుకే ఇక్కడి ప్రజలు వారిని 50 వేల ఓట్ల తేడాతో ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారని ఆయన పేర్కొన్నారు.

మచిలీపట్టణం నియోజకవర్గంలో కొంత మంది ప్రజల పై కక్ష గట్టి అభివృద్ధి పనులు జరగనీయకుండా అడ్డుపడి ప్రజలను అనేక ఇబ్బందులకు గురిచేసారు అని అన్నారు. దీనిని దుర్మార్గం అంటారు అని, ప్రజలు ఓటు వేసి ఎన్నుకున్న తరువాత ప్రజలందరికీ ఉపయోగపడేలా వారి మనసులలో చిరస్థాయిగా గుర్తింపు సంపాదించుకునేలా పని చేయాలి గాని, నీచమైన మనస్తత్వంతో స్వార్ధ రాజకీయాలు కక్షపూరిత రాజకీయాలు తగవు అన్నారు. ఈ ప్రాంతానికి గర్వకారణమైన డా. భోగరాజు పట్టాభి సీతారామయ్య సేవలను స్మరించుకుంటూ, వారి స్మారక చిహ్నంగా మచిలీపట్టణం నడిబొడ్డున దాదాపు రూ. 40 కోట్లతో “భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారక భవనం” నిర్మాణానికి నిధులు తీసుకువచ్చినప్పటికీ, దుర్మార్గ రాజకీయాల వల్ల ఇప్పటివరకు పనులు ప్రారంభం కాకుండా అడ్డుపడ్డారని విమర్శించారు.

తాను చెడ్డ కోతి వనమెల్ల చెరిచింది అన్నట్టు ఇక్కడి కార్పొరేటర్లను ఉపయోగించుకుని ప్రజలకు ఉపయోగపడే ఇటువంటి మంచి పనికి అడ్డు పడ్తున్నారు అని ఇటువంటి రాజకీయాలను ప్రజలు ఉపేక్షించకూడదని పిలుపునిచ్చారు. ఇలాటి మనస్తత్వం ఉన్నవారికి ప్రజాస్వామ్యంలోగాని, పదవుల్లో గాని ప్రజలు ఉంచకూడదు అని, దీనికి జనసేన కార్యకర్తలు కంకణం కట్టుకోవాలి అని అన్నారు.

రాబోయే రెండు నెలల్లో కార్పొరేషన్ లో ఆమోదం పొందించి, వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించి పూర్తి చేస్తామని ఎంపీ బాలశౌరి హామీ ఇచ్చారు. జనసేన పార్టీ “ఉద్యమి” సభ్యత్వ నమోదు కార్యక్రమం నిమిత్తం స్థానిక 4వ వార్డులో ఏర్పాటు చేసిన సభ్యత్వ కేంద్రాన్ని ఎంపీ బాలశౌరి ప్రారంభించారు. జనసేన పార్టీ బలోపేతానికి “ఉద్యమి” సభ్యత్వం కీలక దశగా పేర్కొన్నారు. ప్రతి కార్యకర్త తమవంతుగా వీలైనన్ని సభ్యత్వాలు నమోదు చేయాలని పిలుపునిచ్చారు.

యువత, మహిళలు, ఉద్యోగులు, వ్యాపారవేత్తలు ముందుకు వచ్చి పార్టీ ప్రయాణంలో భాగస్వాములు కావాలని సూచించారు. సభ్యత్వ నమోదు ద్వారా పార్టీ సిద్ధాంతాలు గ్రామస్థాయికి చేరుతాయని తెలిపారు. రాబోయే స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బూత్ స్థాయిలో బలమైన కేడర్ నిర్మాణమే లక్ష్యమని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply