రూ.23 కోట్లతో పలు అభివృద్ధి పనులు
రూ.23 కోట్లతో పలు అభివృద్ధి పనులు
శివారు కాలనీలకు మౌలిక వసతులు : ఎమ్మెల్యే రాము
గుడివాడలో బీటీ రోడ్ల అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే రాము
రూ.99 లక్షల సీఆర్డీఏ నిధులతో ఆర్డీవో కార్యాలయ రోడ్డు…9 మీటర్లకు విస్తరణ పూర్తి…
చిన్న కార్ల స్టాండ్ రోడ్డు7 మీటర్లకు అభివృద్ధి – మూడు రోజుల్లో పనులు పూర్తి
అంతర్గత రహదారులు, డ్రైనేజీల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టాం…..
గుడివాడ అభివృద్ధి సహకరిస్తున్న సీఎం చంద్రబాబుకు… ప్రజలందరి తరపున ధన్యవాదాలు
గుడివాడ, ఆంద్రప్రభ : గుడివాడ పట్టణ వ్యాప్తంగా రూ.23 కోట్లతో పలు అభివృద్ధి పనులు జరుగుతున్నట్లు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. శివారు కాలనీల్లో మౌలిక వసతులు, ప్రధాన ప్రాంతాల్లో బీటీ రోడ్ల నిర్మాణాలు పూర్తయినట్లు ఆయన వెల్లడించారు.
గుడివాడ పట్టణంలో బీటీ రోడ్ల అభివృద్ధి పనులను ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆదివారం ఉదయం అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముందుగా నిర్మాణం పూర్తి చేసుకున్న ఆర్డీవో కార్యాలయ రోడ్డును పరిశీలించారు. అనంతరం తుది దశకు చేరుకున్న గౌరీ శంకరపురంలోని చిన్న కార్ల స్టాండ్ రోడ్డు పనులను పరిశీలించగా, పనుల పురోగతిని అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ, “రూ.99 లక్షల సీఆర్డీఏ నిధులతో 6 మీటర్లు ఉన్న ఆర్డీవో కార్యాలయ రోడ్డును 9 మీటర్ల మేర నూతనంగా విస్తరించి అభివృద్ధి చేశామన్నారు.దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోని, కేవలం ఐదు మీటర్ల వెడల్పుతో ఇబ్బందులు పడుతున్న చిన్న కార్ల స్టాండ్ రోడ్డును 7 మీటర్ల వెడల్పుతో, డ్రైనేజీ సౌకర్యంతో కలిపి రూ.99 లక్షల సీఆర్డీఏ నిధులతో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే డ్రైనేజీ పనులు పూర్తయ్యాయని, మరో మూడు రోజుల్లో బీటీ రోడ్డు నిర్మాణం కూడా పూర్తవుతుంది” అని తెలిపారు.
“సీఎం స్పెషల్ గ్రాంట్, సీఆర్డీఏ, అర్బన్ గ్రీనరీ, ఇతర రాష్ట్ర ప్రభుత్వ శాఖల నిధులు కలిపి రూ.23 కోట్లతో గుడివాడలో పలు అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. గతంలో ఏ ప్రభుత్వం పట్టించుకోని శివారు కాలనీలు, పట్టణంలో అంతర్భాగంగా ఉండి పంచాయతీల పరిధిలో ఉన్న ప్రాంతాలలో సైతం రోడ్లు, డ్రైనేజీలు వంటి మౌలిక వసతులు కల్పించామన్నారు.
పట్టణంలో అత్యంత సమస్యాత్మకమైన బైపాస్ రోడ్డు, బస్టాండ్, ఇతర ప్రధాన రహదారుల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చాం” అని వివరించారు. ఇప్పటికే అనేక పనులు పూర్తిగా గాక, ఇతర పనులు నిర్మాణ దశలో ఉన్నట్లు చెప్పారు.
“త్వరలో పట్టణ వ్యాప్తంగా ఉన్న అంతర్గత రహదారులు, డ్రైనేజీల నిర్మాణ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. అయితే కౌన్సిల్ లేకపోవడంతో 15వ ఆర్థిక సంఘం కోట్లాది రూపాయల నిధులు రాకపోవడం అభివృద్ధికి పెద్ద అవరోధంగా మారిందనీ ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు సమస్యలను పరిష్కరించి గుడివాడ కౌన్సిల్ ఎన్నికలు జరిగేలా ప్రభుత్వం తరఫున కృషి చేస్తున్నామన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మున్సిపల్ ఎన్నికలు జరిగి తీరుతాయి” అని ఎమ్మెల్యే రాము స్పష్టం చేశారు.
“గుడివాడను సుందరంగా, ఆదర్శంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందనీ,పట్టణంలో జరిగే అభివృద్ధి పనులు, సుందరీకరణ పనులకు ప్రజలు తమ వంతు సహకారం అందించి భాగస్వాములు కావాలి” అని ఎమ్మెల్యే రాము విజ్ఞప్తి చేశారు. గుడివాడ అభివృద్ధికి సహకరిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడుకి ఎమ్మెల్యే రాము ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలిపారు.
ఈ పర్యటనలో మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్, గుడివాడ పట్టణ టిడిపి అధ్యక్షుడు పండ్రాజు సాంబయ్య, నందివాడ మండల అధ్యక్షుడు దానేటి సన్యాసిరావు, టిడిపి నాయకులు చేకూరు జగన్మోహన్రావు , మున్సిపల్ అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
