పసుపు శ్రేణుల్లో ఉత్సాహం నింపిన లోకేష్ ప్రసంగం

పసుపు శ్రేణుల్లో ఉత్సాహం నింపిన లోకేష్ ప్రసంగం
మహిళలకు 33 శాతం సీట్లు.. మహానాడులో చారిత్రాత్మక ప్రకటన
అభివృద్ధి, సంక్షేమంపై చర్చకు సిద్ధమంటూ ప్రతిపక్షాలకు సవాల్
అమరావతి, ఆంధ్రప్రభ : తెలుగుదేశం పార్టీ మహానాడు వేదికగా యువనేత నారా లోకేష్ చేసిన ప్రసంగం పసుపు శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. మహిళా సాధికారత నుంచి అభివృద్ధి, సంక్షేమం, పార్టీ భవిష్యత్ దిశ వరకు పలు కీలక అంశాలపై లోకేష్ విస్తృతంగా మాట్లాడారు. ముఖ్యంగా 2029 సార్వత్రిక ఎన్నికల్లో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయిస్తామని ప్రకటిస్తూ చారిత్రాత్మక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందినా, పొందకపోయినా తెలుగుదేశం పార్టీ మహిళలకు 33 శాతం సీట్లు కేటాయిస్తుందని స్పష్టం చేశారు. “ఇది మా సంకల్పం… మా బాధ్యత… మా కమిట్‌మెంట్” అంటూ ప్రకటించడంతో మహానాడు ప్రాంగణం కరతాళధ్వనులతో మారుమోగింది. మహిళలు కేవలం లబ్ధిదారులుగానే కాకుండా నిర్ణయాలు తీసుకునే స్థాయికి ఎదగాలని పార్టీ ఆకాంక్షిస్తోందన్నారు.

భారత రాజకీయాల తదుపరి శకం మహిళా నాయకత్వానిదేనని తాను గట్టిగా నమ్ముతున్నానని లోకేష్ పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో మహిళా సాధికారత గురించి మాట్లాడే అనేక పార్టీలు, ఎన్నికల తర్వాత వారిని విస్మరిస్తున్నాయని విమర్శించారు. కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం సూత్రప్రాయంగా, ఆచరణలో మహిళా సాధికారతకు కట్టుబడి ఉందన్నారు.

మహిళలను కించపరిచేలా మాట్లాడే సంస్కృతిని అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు. పాఠ్యపుస్తకాలలో ఇంటి పనులు చేసే చిత్రాల్లో కూడా మహిళలకే పరిమితం చేయకుండా సమానత్వం ప్రతిబింబించేలా మార్పులు చేయాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు.
మహానాడు నిర్వహణపై స్పందిస్తూ… “ఆఫ్‌లైన్ అయినా, హైబ్రిడ్ అయినా, టీమ్-11కి బ్యాటింగ్ తప్పదు” అంటూ ప్రత్యర్థులపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మహానాడు ప్రతి కార్యకర్త కాలర్ ఎగరేసి “నేను తెలుగు వాడిని… నాది తెలుగుదేశం పార్టీ” అని గర్వంగా చెప్పుకునే వేదిక అని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఎన్టీఆర్ సేవలను గుర్తు చేసుకున్నారు. తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా ఎన్టీఆర్ నిలిచారని, రాజకీయాల్లోనూ, సినిమాల్లోనూ ఆయన ట్రెండ్ సెట్ చేశారని అన్నారు. రెండు రూపాయల కిలో బియ్యం నుంచి మహిళలకు ఆస్తి హక్కుల వరకు అనేక సంక్షేమ కార్యక్రమాలకు ఎన్టీఆర్ నాంది పలికారని కొనియాడారు.
చంద్రబాబు నాయకత్వాన్ని ప్రశంసిస్తూ… “ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా సీబీఎన్ అనే మూడు అక్షరాలకు గౌరవం ఉంది” అన్నారు. ఐటీ నుంచి కృత్రిమ మేధస్సు వరకు, హైటెక్ సిటీ నుంచి క్వాంటమ్ వ్యాలీ వరకు అభివృద్ధికి చంద్రబాబే మార్గదర్శకుడని పేర్కొన్నారు.
2019 నుంచి 2024 వరకు తెలుగుదేశం కార్యకర్తలు చేసిన పోరాటాన్ని లోకేష్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. కేసులు, అరెస్టులు, దాడులు ఎదురైనా కార్యకర్తలు వెనక్కి తగ్గలేదన్నారు. “వై నాట్ 175” అంటూ ప్రారంభమైన ప్రత్యర్థుల నినాదం చివరకు “టీమ్-11”గా మారిందని ఎద్దేవా చేశారు.
2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సాధించిన విజయాన్ని గుర్తుచేస్తూ 94 శాతం స్ట్రైక్ రేట్‌తో 164 స్థానాలు గెలుచుకోవడం చరిత్రాత్మకమన్నారు. పలు ఉమ్మడి జిల్లాల్లో క్లీన్ స్వీప్ సాధించామని తెలిపారు. ప్రజాప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమన్వయం చేస్తోందన్నారు.
అభివృద్ధి, సంక్షేమంపై చర్చకు తాను సిద్ధమని ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. “సమయం, తేదీ మీరు నిర్ణయించండి… చర్చకు నేను రెడీ” అన్నారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వస్తున్నాయని, దేశవ్యాప్తంగా వచ్చే పెట్టుబడుల్లో 25 శాతం ఆంధ్రప్రదేశ్‌కే వస్తున్నాయని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా వైసీపీ పాలనలో బీసీలు, దళితులు, మైనారిటీలపై జరిగిన దాడులను ప్రస్తావించారు. పలు ఘటనలను ఉదహరిస్తూ గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
“మాది గూగుల్… మీది గొడ్డలి” అంటూ ప్రతిపక్షాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “బాబాయిని గొడ్డలితో చంపింది నిజం కాదా… అందుకే మీది గొడ్డలి పార్టీ” అని విమర్శించారు. అలాగే “సైకో… నీది టెన్త్ క్లాస్ పేపర్ కొట్టేసిన చరిత్ర… నాది స్టాన్‌ఫోర్డ్ హిస్టరీ” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
పార్టీలో మార్పులు తీసుకురావడంలో తాను ఎప్పుడూ ముందుంటానని లోకేష్ స్పష్టం చేశారు. గ్రామస్థాయి నాయకుడు కూడా అత్యున్నత స్థాయికి ఎదగాలని పార్టీ ఆశిస్తోందన్నారు. సాంకేతికతను వినియోగిస్తూ ప్రతి కార్యకర్త కృషిని గుర్తించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఫేక్ ప్రచారాలను గట్టిగా తిప్పికొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. “ఇక నుంచి గేర్ మార్చాలి… మిషన్ మోడ్‌లో పని చేయాలి… ప్రతి ఎన్నికలో గెలవాలి” అంటూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
