మక్తల్ అభివృద్ధికి చారిత్రాత్మక అడుగు..

  • రూ.237 కోట్లతో మక్తల్–నారాయణపేట నాలుగు లైన్ల హ్యామ్ రోడ్డుకు శంకుస్థాపన
  • ప్రజా ప్రభుత్వం తోనే అభివృద్ధి సాధ్యం
  • మంత్రులు వాకాటి శ్రీహరి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు

మక్తల్, ఆంధ్రప్రభ : మక్తల్ నియోజకవర్గ అభివృద్ధిలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. హ్యామ్ రోడ్ల శంకుస్థాపన కార్యక్రమం కోసం విచ్చేసిన రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి లకు రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి ఘన స్వాగతం పలికారు. అనంతరం నారాయణ పేట రోడ్డులో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, వీర్లపల్లి శంకర్‌, జిల్లా కలెక్టర్ ప్రియాంకతో పాటు ప్రజాప్రతినిధులు కలిసి రూ.237 కోట్లతో నిర్మించనున్న మక్తల్–నారాయణపేట నాలుగు లైన్ల హ్యామ్ రోడ్డుకు శంకుస్థాపన చేసి, హ్యామ్ రోడ్ల పైలాన్‌ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ… మక్తల్ నియోజకవర్గంలో ఈరోజు ప్రారంభమైన రోడ్ల నిర్మాణ పనులు చారిత్రాత్మకమైనవని అన్నారు. ప్రజాప్రభుత్వం ప్రజల అవసరాలనే ప్రాధాన్యంగా తీసుకొని ఈ భారీ రహదారి ప్రాజెక్టులను మంజూరు చేసిందని తెలిపారు. మక్తల్ నుంచి నారాయణపేట వరకు రహదారి నిర్మాణం ఎన్నో ఏళ్లుగా అగ్నిపరీక్షగా మారిందన్నారు. దాదాపు పది మంది కలెక్టర్లు, పలువురు ఎమ్మెల్యేలు మారినా ఈ రోడ్డు మంజూరు కాలేదని గుర్తు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి పేరుతో గొప్పలు చెప్పిందని, కానీ నాణ్యమైన రహదారుల నిర్మాణంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు.

పదేళ్ల పాటు మాటలు, ప్రచార ఆర్భాటాలు, రంగురంగుల హామీలతో ప్రజలను మోసం చేశారని అన్నారు. నిర్మించిన రహదారులు కూడా నాసిరకంగా ఉండటంతో వందలాది గుంతలు ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజల రవాణా కష్టాలు తొలగించాలనే సంకల్పంతో రూ.237 కోట్లతో మక్తల్–నారాయణపేట నాలుగు లైన్ల రహదారిని ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. మక్తల్ నియోజకవర్గానికి ఏ అభివృద్ధి పని కోరినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సంబంధిత మంత్రులు వెంటనే సానుకూలంగా స్పందిస్తూ నిధులు మంజూరు చేస్తున్నారని, ఇందుకు ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఎన్నో ఏళ్లుగా వెనుకబడిన మక్తల్ నియోజకవర్గం ఇప్పుడు అభివృద్ధి బాటలో దూసుకుపోతోందని, ప్రజలు స్వేచ్ఛగా, గౌరవంగా జీవించే పరిస్థితులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. అదేవిధంగా మరికల్ – మినాస్ పూర్ – లింగంపల్లి రోడ్డు కు 49.57 కోట్లు,ఆత్మకూరు – మరికల్ రోడ్డు కు 22.47 కోట్లు, మాగనూరు మండలం నల్లగట్టు – హిందూపూర్ రోడ్డుకు 10.49 కోట్లతో రోడ్లు వేయనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.మొత్తం మక్తల్ నియోజకవర్గానికి 320 కోట్లు రోడ్లకే ఖర్చు చేయనున్నట్లు తెలిపారు.
మక్తల్ అభివృద్ధి ప్రయాణానికి ప్రజల ఆశీర్వాదం, సహకారం ఎల్లప్పుడూ ఉండాలని మంత్రి వాకిటి శ్రీహరి ఆకాంక్షించారు.

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. ప్రభుత్వం అభివృద్ధిని విస్మరించి సొంత ప్రయోజనాలకు పాకులాడింది అన్నారు. పూర్తిగా వెనుకబడిన మక్తల్ నియోజకవర్గం పూర్తి అండగా ఉంటుందన్నారు. మంత్రి వాకిటి శ్రీహరి ఎప్పుడు ఈ ప్రాంత అభివృద్ధి కోసం పరితపిస్తుంటారని అన్నారు .పట్టుబట్టి మరి మక్తల్ నారాయణపేట రోడ్డులో నాలుగు లైన్ల రోడ్డుగా వేసేందుకు మంత్రి వాకిటి శ్రీహరి నిధులు కోరడంతో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు .

వీలైనంత త్వరగా రోడ్డును పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి అధికారులు కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు అధికారులు పాల్గొన్నారు. అంతకు ముందు మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని త్రిప్రాస్ పల్లి నుండి మక్తల్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు .అనంతరం కాచ్ వార్ వద్ద మంత్రులు కోమటిరెడ్డి, జూపల్లి లకు వాకిటి శ్రీహరి స్వాగతం పలికారు.అక్కడి నుండి నిర్వహించిన బైక్ ర్యాలీలో ముగ్గురు మంత్రులు పాల్గొన్నారు.