ఉల్లి డీహైడ్రేషన్ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు…
ఉల్లి డీహైడ్రేషన్ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు…
వచ్చే మంగళవారం నాటికి సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశం…
జిల్లా కలెక్టర్ డా. ఏ.సిరి
కర్నూలు, ఆంధ్రప్రభ : జిల్లాలో ఉల్లి రైతులకు విలువ ఆధారిత మార్కెటింగ్ అవకాశాలు కల్పించే దిశగా ఉల్లి డీహైడ్రేషన్ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఏ.సిరి అధికారులను ఆదేశించారు. స్వయం సహాయక సంఘాల (SHG) ద్వారా జిల్లాలో డీహైడ్రేషన్ యూనిట్ల స్థాపనకు సంబంధించిన ప్రతిపాదనలను వచ్చే మంగళవారం నాటికి సిద్ధం చేయాలని ఉద్యాన, ఫుడ్ ప్రాసెసింగ్, మెప్మా శాఖల అధికారులకు సూచించారు.
మంగళవారం కలెక్టరేట్ కార్యాలయంలో ఉల్లి సాగు, ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు అంశాలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో ఉల్లి సాగు విస్తీర్ణం పెరుగుతున్న నేపథ్యంలో రైతులకు శాశ్వత మార్కెట్ అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఉల్లి దిగుబడులను పెంచేందుకు మెరుగైన రకపు విత్తనాలను వినియోగించడంతో పాటు విత్తనాల నాటేందుకు ఉపయోగించే ‘సీడ్ డ్రిల్లర్’ యంత్రాలను సబ్సిడీపై రైతులకు అందించేలా చర్యలు చేపట్టాలని ఉద్యాన శాఖ అధికారులను ఆదేశించారు.

ఉల్లి పంట కోత అనంతరం నిల్వ సదుపాయాల కొరతతో రైతులు నష్టపోకుండా ఉండేందుకు డీహైడ్రేషన్ యూనిట్లు, కోల్డ్ స్టోరేజ్ కేంద్రాల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఉల్లిపాయలను ప్రాసెసింగ్ చేయడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం లభించే అవకాశముందని తెలిపారు. ఈ అంశాలపై పూర్తి స్థాయి నివేదికను సిద్ధం చేసి సమర్పించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఉద్యాన శాఖ అధికారి రాజాకృష్ణ రెడ్డి, ఏపీఏంఐపీ పీడీ శ్రీనివాసులు, మెప్మా పీడీ శ్రీనివాసులు తదితర అధికారులు పాల్గొన్నారు.
