Telangana Farmers | ఎరువుల ధరల పెంపుతో రైతులపై అదనపు భారం
Telangana Farmers | ఎరువుల ధరల పెంపుతో రైతులపై అదనపు భారం
Telangana Farmers | డీజిల్ ధరలతో పెరుగుతున్న వ్యవసాయ యంత్రాల ఖర్చు
ఎల్నినో భయంతో ఖరీఫ్ సాగుపై ఆందోళన
వర్షాభావ హెచ్చరికలతో అన్నదాతల్లో కలవరం
ప్రత్యామ్నాయ పంటలపై డోలాయమానంలో రైతులు
Telangana Farmers | హైదరాబాద్, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో ఈ ఏడాది ఖరీఫ్ సాగు కష్టతరంగా మారనుంది. ఓవైపు మధ్యప్రాచ్యంలో యుద్ధం కారణంగా పెరుగుతున్న ఎరువుల ధరలు, పెరిగిన పెట్రోల్ ధరల వల్ల యంత్రాల వ్యయం ఎక్కువవడం భారంగా మారనుండగా, ఎల్నినో భయం వెంటాడుతోంది. యుద్ధం కారణంగా యూరియా, డీఏపీ మినహా ఇతర కాంప్లెక్స్ ఎరువుల ధరలు విపరీతంగా పెరిగాయి. ఇప్పటికే విత్తనాలు, కూలీల వేతనాలు, పురుగు మందుల ధరలు పెరిగిన నేపథ్యంలో ఎరువుల ధరల పెంపు రైతులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది.
దేశంలో ఫాస్ఫేట్, పొటాష్ ఎరువుల తయారీకి అవసరమైన ముడిసరుకు అధిక భాగం మధ్య పశ్చిమాసియా దేశాల నుంచే దిగుమతి అవుతోంది. యుద్ధం కారణంగా ప్రతి కాంప్లెక్స్ ఎరువు బస్తాపై కనీసం రూ.300 నుంచి రూ.500 వరకు ధర పెరగడంతో పెట్టుబడి వ్యయం భారీగా పెరగనుంది. రాష్ట్రంలో అధిక విస్తీర్ణంలో సాగయ్యే ప్రధాన పంటలు వరి, పత్తి, మొక్కజొన్న, సోయా, మిర్చి తదితర పంటలకు సీజన్‌లో కనీసం మూడు సార్లు 20:20:0, పొటాష్, 10:26:26, 17:17:17 తదితర కాంప్లెక్స్ ఎరువులను వేయాల్సి ఉంటుంది.
కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెరిగిన కారణంగా ఖరీఫ్ సాగు ఖర్చులు పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. వరి ఎకరానికి మూడు బస్తాలు వాడే 20:20:13 బస్తాపై రూ.500 మేర పెరగడంతో రూ.1,500 భారం ఒక్క ఈ ఎరువు కారణంగానే రైతులపై పడుతోంది. ఈ నేపథ్యంలో వరి, పత్తి, సోయాబిన్, మొక్కజొన్న, మిర్చి, కూరగాయల పంటల సాగుకు ఎరువుల వినియోగం ఎక్కువ కావడంతో పెట్టుబడి వ్యయం తడిసిమోపెడు కానుంది.
వ్యవసాయ యంత్రాలపై అదనపు ఖర్చు
అడ్డూ అదుపు లేకుండా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు సాగును మరింత భారంగా మార్చాయి. ప్రస్తుతం వ్యవసాయంలో వినియోగించే 90 శాతం యంత్రాలు డీజిల్‌తోనే నడుస్తున్నాయి. దుక్కి దున్నే ట్రాక్టర్ మొదలు వరి కోత యంత్రాలు, ఎరువులు, ధాన్యం రవాణాకు వినియోగించే ఆటో, ట్రాక్టర్ల వరకు యంత్రాలకు డీజిల్ కావాల్సిందే. ఈ పరిస్థితుల్లో పెరిగిన డీజిల్, పెట్రోల్ ధరలతో ట్రాక్టర్ల అద్దె, విత్తనాలు, ఎరువుల రవాణా ఖర్చులు, కోత యంత్రాల అద్దె భారీగా పెరగనున్నాయి.
మరోవైపు ఈ ఏడాది ఎల్నినో భయం వెంటాడుతోంది. ఏరువాకకు అంతా సిద్ధమవుతుండగా, వర్షాలు తక్కువగా కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలు అన్నదాతలను కలవరపెడుతున్నాయి. ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని, ఖరీఫ్ పంటలు గింజ కట్టే సెప్టెంబర్, అక్టోబర్‌లో వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దీనివల్ల ముఖ్యంగా వర్షాధార పంటలైన పత్తి, మొక్కజొన్న, వరి సాగు చేసే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం నెలకొంది.
ఈ వానాకాలంలో సాధారణ వర్షపాతంలో 10 నుంచి 20 శాతం వరకు లోటు ఏర్పడే అవకాశం ఉంటుందన్న ఆందోళన రైతుల ఆశలను నీరుగారుస్తోంది. దీనివల్ల పెట్టుబడులు పెరగగా, దిగుబడి తగ్గుతుందన్న భయం రైతుల్లో ఎక్కువైంది.
డోలాయమానంలో రైతులు
ఈసారి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటలు వేయాలని విస్తృతంగా ప్రచారం చేయడంతో ఏ పంటలు వేయాలో తేల్చుకోలేక రైతులు డోలాయమానంలో ఊగిసలాడుతున్నారు. వరి సాగు చేయొద్దని, వరికి బదులు పప్పుధాన్యాలు, ఉద్యాన పంటల సాగుకు మళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం రైతులను కోరుతోంది. అయితే చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, కూరగాయల పంటలకు కోతుల బెడద వెంటాడుతుండడంతో రైతులు చిరు, పప్పుధాన్యాల సాగుకు మొగ్గు చూపడం లేదు.
ఏటా ఖరీఫ్, రబీ సీజన్‌లో రాష్ట్రంలో అత్యధికంగా 60 లక్షల ఎకరాల్లో వరి, 50 లక్షల ఎకరాల వరకు పత్తి, 10 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగవుతోంది. ఇప్పుడు ఉన్నపళాన రైతులు వరి, పత్తి సాగును వదిలేసి ప్రత్యామ్నాయ పంటల సాగుకు ఏ మేర మళ్లుతారనేది వేచి చూడాలి.
