Telangana Green Drive | 16.06 కోట్ల మొక్కల నాటడమే లక్ష్యం

Telangana Green Drive | 16.06 కోట్ల మొక్కల నాటడమే లక్ష్యం

Telangana Green Drive | వన మహోత్సవానికి భారీ ఏర్పాట్లు
గ్రామాల నుంచి పట్టణాల వరకు హరిత యజ్ఞం
మొక్కల సంరక్షణకు జియో ట్యాగింగ్
నిర్లక్ష్యంపై చర్యల హెచ్చరికలు
జన భాగస్వామ్యంతో గ్రాండ్ సక్సెస్ లక్ష్యం

Telangana Green Drive | హైదరాబాద్, ఆంధ్రప్రభ: రాష్ట్రాన్ని మరింత పచ్చదనంతో కళకళలాడేలా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం భారీ హరిత యజ్ఞానికి శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది వన మహోత్సవంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 16.06 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకుంది. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో అటవీ శాఖతో పాటు అన్ని ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థలు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థుల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని ఉద్యమంలా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

రంగారెడ్డి జిల్లా గుర్రంగూడ అర్బన్ ఫారెస్ట్ పార్కులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు మూడు రోజుల్లో వన మహోత్సవాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని, ఈసారి కేవలం మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణ బాధ్యతలను కూడా ప్రభుత్వం పక్కాగా ప్రణాళిక చేసింది.

పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో అత్యధికంగా 6.18 కోట్ల మొక్కలను నాటనున్నారు. హైదరాబాద్ మహానగర పరిధిలో అర్బన్ పార్కులు, లేఅవుట్లు, ఓపెన్ స్పేస్‌లలో హెచ్ఎండీఏ, మున్సిపల్ పరిపాలన శాఖల ఆధ్వర్యంలో 7.20 కోట్ల మొక్కలు నాటేలా ప్రణాళిక రూపొందించారు. అటవీ శాఖ, టీఎస్ఎఫ్ఎసీ 86 లక్షలు, వ్యవసాయ శాఖ 90 లక్షలు, విద్యుత్ శాఖ 22.5 లక్షలు, రెవెన్యూ శాఖ 24 లక్షలు, పరిశ్రమల శాఖ 12.6 లక్షలు, హోంశాఖ 7.2 లక్షలు, విద్యాశాఖ 4.11 లక్షలు నాటాలని నిర్ణయించారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12,750 గ్రామ పంచాయతీ నర్సరీల్లో మొక్కలు పెంచుతున్నారు. ఇందులో కమ్యూనిటీ, అవెన్యూ ప్లాంటేషన్లతో పాటు ఈత, తాటి, ఉద్యానవన మొక్కలు, జామ, నిమ్మతో పాటు పలురకాల పండ్ల మొక్కలను సైతం పెంచుతున్నారు. ఇంటింటికీ పంపిణీ చేసేందుకు గ్రామాల్లో ఏర్పాట్లు సైతం చేస్తున్నారు. ప్రజలకు ఉచితంగా పంపిణీ చేసేందుకు వీలుగా ప్రతి గ్రామంలోనూ, మున్సిపల్ వార్డుల్లోనూ ప్రత్యేక పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

ఔషధ మొక్కలను కూడా ఈసారి ఎక్కువగా పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం. జన భాగస్వామ్యంతోనే ఈ వన మహోత్సవాన్ని గ్రాండ్ సక్సెస్ చేయాలని ప్రభుత్వం పిలుపు మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

నిరంతర నిఘా.. జియో ట్యాగింగ్

నాటిన ప్రతి మొక్క బతికేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, కేవలం ఫొటోల కోసం, రికార్డుల కోసం కాకుండా క్షేత్రస్థాయిలో మార్పు కనిపించాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మొక్కలు నాటడంతోనే సరిపెట్టకుండా, వాటి మనుగడను పెంచేందుకు ఈసారి అధునాతన సాంకేతికతను వాడుతున్నారు. నాటిన ప్రతి మొక్కను జియో ట్యాగింగ్ చేయనున్నారు.

గ్రామాల్లో నాటిన మొక్కల సంరక్షణ బాధ్యతను స్థానిక సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు, పట్టణాల్లో వార్డు అధికారులకు అప్పగించారు. ఎండకాలంలో కూడా వీటికి నీళ్లు పోసేలా ముందస్తు ప్రణాళికలు రూపొందించారు. జిల్లాల వారీగా కలెక్టర్లు, స్థానిక సంస్థల అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి.

Leave a Reply