AP | టీడీపీ పొలిట్ బ్యూరోలో కీలక నిర్ణయాలు..
- కడపలో మహానాడు
- త్వరలోనే పార్టీ ఎన్నికల నోటిఫికేషన్
- మార్చి నుంచి ప్రజల్లోకి ఎమ్మెల్యేలు, పార్టీ యంత్రాంగం
టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన టీడీపీ పొలిట్ బ్యూరో మీటింగ్ మూడున్నర గంటల పాటు కొనసాగింది. ఈ సమావేశంలో ప్రధాన అంశాలపై చర్చించారు
మే నెలలో నిర్వహించనున్న మహానాడు కార్యక్రమాన్ని కడపలో నిర్వహించాలని పొలిట్ బ్యూరో నిర్ణయించింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేతృత్వంలో నిర్వహించిన పొలిట్ బ్యూరో సమావేశంలో… పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియపై ప్రాధాన్యతతో చర్చించుకున్నారు. మహానాడుకు ముందే పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ పూర్తిచేయాలని నిర్ణయించారు. త్వరలోనే పార్టీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుందని సమాచారం.
ఈ సమావేశంలో నామినేటెడ్ పదవుల భర్తీపై సుదీర్ఘంగా చర్చించారు. మూడో దఫా నామినేటెడ్ పోస్టుల భర్తీకి అర్హుల జాబితా సిద్ధం కాగా… ఒకటి రెండు రోజుల్లో జాబితాను విడుదల చేయాలని యోచిస్తున్నారు.
అసెంబ్లీ సమావేశాల అనంతరం మార్చి నుంచి ఎమ్మెల్యేలు, పార్టీ యంత్రాంగం ప్రజల్లోకి వెళ్లేందుకు కార్యాచరణ రూపొందించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లే విధంగా కార్యాచరణను సిద్ధం చేశారు. పార్టీ సభ్యత్వ నమోదుపై కూడా సమాలోచనలు జరిగాయి.
పొలిట్ బ్యూరోలో తీసుకున్న ముఖ్య నిర్ణయాలు:
పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయం.
మూడు నెలల వ్యవధిలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి కమిటీల వరకు ఎన్నికలు పూర్తి చేయాలి.
మహానాడులో చంద్రబాబును మరోసారి టీడీపీ అధ్యక్ష పదవికి ఎన్నుకునే కార్యాచరణ సిద్ధం.
సంస్థాగత ఎన్నికల ప్రక్రియ మహానాడు వరకు కొనసాగి, అధ్యక్షుడిగా చంద్రబాబు ఎన్నికైన తర్వాత ముగుస్తుంది.
బడుగు, బలహీన వర్గాలకు కమిటీల్లో ప్రాధాన్యత ఇవ్వాలని పార్టీ నిర్ణయం.