రోబోటిక్ జాయింట్ రీప్లేస్‌మెంట్‌లో ఏపీనే అగ్రగామి

రోబోటిక్ జాయింట్ రీప్లేస్‌మెంట్‌లో ఏపీనే అగ్రగామి

2030 విజన్‌తో సాయి భాస్కర్ హాస్పిటల్
స్ట్రైకర్ భాగస్వామ్యంతో ముందుకు
ప్రతి జాయింట్ రీప్లేస్‌మెంట్‌కు ఒక మొక్క నాటే ప్రయత్నం
అందుబాటు ధరల్లో రోబోటిక్ సర్జరీ.
యువ సర్జన్లకు పూర్తిస్థాయి శిక్షణ..
మెడికల్ టూరిజానికి కేంద్ర బిందువుగా అమరావతి
సాయి భాస్కర హాస్పిటల్స్ ఎండి బూసిరెడ్డి నరేందర్ రెడ్డి..

ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : రోబోటిక్ జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జరీని దేశంలో ప్రామాణిక వైద్య విధానంగా మార్చడమే లక్ష్యంగా 2030 విజన్‌తో ముందుకు సాగుతున్నామని సాయి భాస్కర్ హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ బూసిరెడ్డి నరేందర్ రెడ్డి తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాత ఆర్థోపెడిక్ టెక్నాలజీ సంస్థ స్ట్రైకర్‌తో కలిసి రోగులకు అత్యంత కచ్చితత్వం, భద్రత, వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా చికిత్స అందించేందుకు కార్యాచరణ చేపట్టినట్లు వెల్లడించారు. విజయవాడలో నిర్వహించిన విలేకరులతో మాట్లాడుతూ ప్రతి రోగికి ప్రత్యేక వైద్య ప్రణాళిక రూపొందించడం, రోబోటిక్ సర్జరీపై అవగాహన పెంచడం, యువ సర్జన్లకు ఆధునిక శిక్షణ అందించడం తమ 2030 విజన్‌లో కీలక అంశాలని చెప్పారు. ప్రస్తుతం రోబోటిక్ సర్జరీ ఖరీదైన వైద్య సేవగా భావిస్తున్న పరిస్థితిని మార్చి, సాధారణ ప్రజలకు కూడా అందుబాటులోకి తీసుకురావాలనే సంకల్పంతో పనిచేస్తున్నామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే ప్రముఖ రోబోటిక్ సర్జరీ, మెడికల్ టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. దేశ విదేశాల నుంచి రోగులు రోబోటిక్ జాయింట్ రీప్లేస్‌మెంట్ కోసం అమరావతిని ఆశ్రయించే పరిస్థితి తీసుకురావడమే తమ దీర్ఘకాలిక ప్రణాళిక అని వెల్లడించారు.

ప్రతి ఆపరేషన్‌కు ఒక మొక్క..

వైద్య సేవలతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు డాక్టర్ నరేందర్ రెడ్డి తెలిపారు. ప్రతి జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జరీకి ఒక మొక్క నాటే కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. కేవలం మొక్కలు నాటడం కాకుండా వాటిని సంరక్షించి పెంచడంపైనా ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని వివరించారు. 2021లో ప్రారంభించిన ఎవర్‌గ్రీన్ ఫౌండేషన్ ద్వారా ఇప్పటివరకు 8 వేల మొక్కలు నాటగా, వాటిలో 5 వేల మొక్కలు విజయవంతంగా పెరుగుతున్నాయని వెల్లడించారు. ‘నేను – నా పేషెంట్ – నా మొక్కఅనే భావనతో వైద్యులు, రోగులు, ప్రకృతి మధ్య భావోద్వేగ బంధాన్ని పెంపొందించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.

రోబోటిక్ లో సర్జన్ నియంత్రణే కీలకం..

రోబోటిక్ సర్జరీపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించాల్సిన అవసరం ఉందని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. రోబోటిక్ సర్జరీ అంటే రోబోట్ స్వయంగా ఆపరేషన్ చేయడం కాదని, పూర్తిగా సర్జన్ నియంత్రణలోనే జరిగే ‘రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీ’ అని స్పష్టం చేశారు. రోబోటిక్స్ ద్వారా శస్త్రచికిత్సల్లో అత్యంత కచ్చితత్వం, భద్రత, మెరుగైన ఫలితాలు సాధ్యమవుతున్నాయని తెలిపారు. సంప్రదాయ పద్ధతులతో పోలిస్తే రోబోటిక్ విధానంలో లభిస్తున్న ప్రయోజనాలపై పరిశోధనలు నిర్వహిస్తున్నామని, త్వరలో శాస్త్రీయ అధ్యయన నివేదికను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.

సామాన్యులకు అందని రోబోటిక్ సర్జరీ..

ఈ సందర్భంగా స్ట్రైకర్ ఇండియా ప్రతినిధులు మాట్లాడుతూ దేశంలో రోబోటిక్ జాయింట్ రీప్లేస్‌మెంట్ వేగంగా విస్తరిస్తున్నప్పటికీ, ఇంకా 90 శాతం మంది రోగులకు ఈ సౌకర్యం అందడం లేదన్నారు. సాయి భాస్కర్ హాస్పిటల్‌తో భాగస్వామ్యం ద్వారా మరింత మంది రోగులకు నాణ్యమైన, వ్యక్తిగతీకరించిన చికిత్స అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. రోగుల అవగాహన, యువ సర్జన్ల శిక్షణ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన విస్తరణ ద్వారా రోబోటిక్ జాయింట్ రీప్లేస్‌మెంట్‌ను సాధారణ వైద్య విధానంగా మార్చేందుకు సంయుక్తంగా కృషి చేస్తామని వెల్లడించారు.

Leave a Reply