Indonesia Open | క్వార్టర్స్ కు సత్విక్-చిరాగ్ జోడీ !

ఇండోనేసియా ఓపెన్ బాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత పురుషుల డబుల్స్ జోడీ సత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి – చిరాగ్ శెట్టీ అద్భుత విజయాన్ని సాధించారు. డెన్మార్క్‌కు చెందిన రాస్మస్ క్జెర్ – ఫ్రెడరిక్ సోగార్డ్ జోడీతో జరిగిన హోరాహోరీ మ్యాచ్‌లో సత్విక్-చిరాగ్ జోడీ 16-21, 21-18, 22-20 తేడాతో గెలుపొందింది.

ఈ మ్యాచ్‌ మొత్తం ఒక గంట ఎనిమిది నిమిషాలు సాగింది. మొదటి గేమ్‌ను కోల్పోయినప్పటికీ, తరువాతి రెండు గేమ్‌లను గెలిచిన భారత జోడీ క్వార్టర్‌ఫైనల్స్‌లోకి దూసుకెళ్లింది. ఈ విజయం BWF సూపర్ 1000 టోర్నీలో భారత్‌కు పెద్ద ఊరటను ఇచ్చింది.

ఇతర విభాగాల్లో మాత్రం భారత క్రీడాకారులకు నిరాశే ఎదురైంది. సింగిల్స్ విభాగంలో పి.వి. సింధు ప్రీక్వార్టర్స్‌లోనే టోర్నీకి గుడ్‌బై చెప్పింది. థాయ్‌లాండ్‌కు చెందిన పోర్న్‌పావీ చోచువోంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి గేమ్‌ను 16-10 తేడాతో ఆకట్టుకునే విధంగా గెలిచినప్పటికీ, రెండో గేమ్‌ను 10-21 తేడాతో కోల్పోయింది. ఇక‌ నిర్ణయాత్మకమైన మూడో గేమ్‌లో సింధు కాస్త పోరాటం చేసినా, చివర్లో తడబడి 18-21 తేడాతో ఓడిపోయింది.

మహిళల డబుల్స్‌లో త్రీశ జాలీ – గాయత్రీ గోపీచంద్ జోడీ కూడా నిరాశ పరిచింది. జపాన్‌కు చెందిన యుకి ఫుకుషిమా – మాయు మాత్సుమోటో జోడీ చేతిలో 13-21, 22-24 తేడాతో పరాజయం పాలైంది.

మిక్స్‌డ్ డబుల్స్‌లో సతీష్ కరుణాకరణ్ – ఆద్య వరియత్ జోడీ కూడా తొలి దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. థాయ్‌లాండ్‌కు చెందిన డెచపోల్ పువారంకరోహ్ – సుపిస్సారా పవ్‌సంఫ్రాన్ జోడీ చేతిలో 21-7, 21-12 తేడాతో ఏకపక్షంగా ఓడిపోయారు. ఈ మ్యాచ్ కేవలం 25 నిమిషాల్లోనే ముగిసింది.

మొత్తంగా, సత్విక్-చిరాగ్ విజయంతో ఒక్క పురుషుల డబుల్స్‌ విభాగంలో మాత్రమే భారత్‌కు విజయవంతమైన ప్రదర్శన కనిపించింది.

Leave a Reply