ప్రచారం కొండంత.. అమలు గోరంత

ప్రచారం కొండంత.. అమలు గోరంత

హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో: ఆచరణకు సాధ్యం కాని స్థాయిలో లక్ష్యాన్ని ఎంచుకుని మొదలుపెట్టిన ‘ఇందిరమ్మ ఇళ్ల’ పథకం అమలులో విఫలమవుతోంది. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా.. ఈ పథకం ఆశించిన స్థాయిలో పురోగతి సాధించలేకపోయింది. మొదటి విడత లబ్ధిదారుల ఎంపికలో అర్హులకు అవకాశం దక్కలేదన్న ఆరోపణలు ఓవైపు, మంజూరైన ఇళ్లలో ఊరికి పది కూడా దక్కలేదన్న విమర్శ మరోవైపు… వేలెత్తి చూపుతున్నాయి. రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు, క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులకు ఏమాత్రం పొంతన కుదరడం లేదు.

ప్రతి నియోజకవర్గంలోనూ ఈ పథకం అమలు సమస్యాత్మకంగానే కనిపిస్తోంది. తీరా ఇళ్లు మంజూరయ్యాక లబ్ధిదారులకు ఆ నిర్మాణం పెద్ద సవాలుగా మారుతోంది. తొలివిడతలో దాదాపు 80శాతం లబ్ధిదారులు రాజకీయ జోక్యం లేకుండానే ఎంపికైనప్పటికీ, వారి ఆర్థిక స్తోమత ఇంటి పునాది కూడా వేయలేని స్థాయిలో కనిపిస్తోంది. చిన్న, పెద్ద కలుపుకుని గ్రామానికి 10 నుంచి 20 ఇళ్లు, మండల కేంద్రాలకు గరిష్టంగా 50 ఇళ్లు మాత్రమే మంజూరయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఇందిరా ఆవాస్ యోజన కూడా ఆశించిన సాయం అందించలేదు. దీంతో ఇప్పటికీ అసంపూర్తి ఇళ్లు దిష్టిబొమ్మల్లా కనిపిస్తున్నాయి.

గ్రామాల్లో వెల్లువెత్తుతున్న విమర్శలు
తొలి విడతలో 71,482 మందిని మాత్రమే ఎంపిక చేశారు. పైగా వాటిపైనా రీ-సర్వే ఆదేశాలు రావడంతో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. లబ్ధిదారుల సంఖ్య మూడో వంతుకు తగ్గడంతో పేద వర్గాలు మండి పడుతున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు సర్ది చెప్పేందుకు చేస్తున్న ప్రయత్నాలు కూడా విఫలమవుతున్నాయి. యాప్ సర్వే, కుటుంబ సర్వే ఆధారంగా వారిని మూడు విభాగాలుగా విభజించారు. సొంత ఇంటి స్థలం ఉండి ఇళ్లు లేనివారిని ఎల్-1 జాబితాలో చేర్చారు. సొంత స్థలం ఉండి గుడిసె, పూరిపాక, మట్టిమిద్దెలు, రేకుల ఇళ్లు ఉన్నవారిని ఈ జాబితాలో చేర్చారు. సొంత స్థలం లేనివారిని ఎల్-2 జాబితాలో చేర్చారు. సొంత ఇల్లు ఉండీ ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న వారిని ఎల్-3లో చేర్చారు.

ఈ ప్రకారం ఎల్-1లో 21.93 లక్షలు, ఎల్-2లో 19.96 లక్షలు, ఎల్-3లో 33.87 లక్షల దరఖాస్తులు ఉన్నాయి. అయితే, హైదరాబాద్ నగరపాలక సంస్థ పరిధిలో ఇంకా 2.43 లక్షల ఇళ్లను పరిశీలించాల్సి ఉంది. మొదటి విడతలో రాష్ట్రవ్యాప్తంగా 562 గ్రామాల నుంచి 71,482 మందిని లబ్ధిదారులుగా ఎంపిక చేశారు. వీరిలో ఎల్-1 నుంచి 59,807 మంది, ఎల్-2 నుంచి 1,945 మంది, ఎల్-3 నుంచి 5,732 మంది ఎంపికయ్యారు. కొత్త దరఖాస్తుల నుంచి మరో 3,998 మందికి అవకాశం కల్పించారు.

వెంటాడుతున్న సాంకేతిక సమస్యలు
ప్రభుత్వం ఇప్పటి వరకు మంజూరు చేసిన వాటిలో 60శాతం పునాది స్థాయిని దాటడం లేదు. తొలి విడతలో 71వేల మందికి మంజూరు చేయగా.. అందులో 65వేల మంది అర్హులుగా తేలారు. వీరిలో సుమారు 10వేల మంది బేస్‌మెంట్ పూర్తి చేయగా.. మరో 25 నుంచి 30 వేల మంది నిర్మాణం ప్రారంభించారు. ప్రభుత్వం దశల వారీగా నగదు అందజేస్తున్నప్పటికీ, 400 నుంచి 600 చదరపు అడుగుల విస్తీర్ణంలోనే నిర్మించాలని షరతు విధించింది. మరోవైపు ప్రభుత్వం ఇచ్చే సొమ్ముకంటే ఇంటి నిర్మాణానికి అదనంగా ఖర్చు కావడంతో లబ్ధిదారులు వెనుకడుగు వేస్తున్నారు. ప్రధానంగా సిమెంట్ బస్తా ధర రూ.30 నుంచి రూ.50 వరకు పెరగడంతో సుమారు రూ.10వేల వరకు అదనపు భారం పడే అవకాశం ఉంది.

పొంతన లేని లెక్కలు
ఇప్పటి వరకు లక్షకు పైగా ఇళ్లు గ్రౌండింగ్ అయినట్లు అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో మొత్తం దాదాపు 3లక్షల ఇళ్లు మంజూరు కాగా, 2.37 లక్షల మందికి మంజూరీ పత్రాలు అందజేశారు. వీటిలో 1.03 లక్షల ఇళ్లు గ్రౌండింగ్ అయి వివిధ దశల్లో ఉన్నాయి. ఈ విషయంలో సూర్యాపేట, పెద్దపల్లి, భూపాలపల్లి, హనుమకొండ, వికారాబాద్, సిద్దిపేట, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలు వెనుకబడ్డాయి. పనితీరు ఆశించినంతగా లేదు.

హైదరాబాద్ మహానగరంలో ఈ పథకం అమలు మరింత అధ్వానంగా ఉంది. ఇప్పటి వరకు కేవలం 100 ఇళ్లు మాత్రమే స్లాబ్ లెవల్‌కు చేరాయి. నగరంలో ఇళ్లు లేకుండా, కేవలం ఇంటి స్థలం కలిగిన వారు 18,055 మంది ఉన్నారు. ఇల్లు, స్థలం రెండూ లేనివారు 8,16,832 మంది ఉండగా.. అందులో 80 శాతం మంది గత ప్రభుత్వ రెండు పడకగదుల ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారే.

Leave a Reply