Indians | పశ్చిమాసియా యుద్ధంపై…

Indians | పశ్చిమాసియా యుద్ధంపై…

Indians | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ భారతీయుల భద్రతపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయుల రక్షణ కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

రాజ్యసభలో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోడీ భారతీయుల భద్రతకే ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామని వెల్లడించారు. విదేశాల్లో ఉన్న భారతీయులు సురక్షితంగా దేశానికి చేరుకునేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో సముద్ర మార్గాల్లో ఇరుక్కుపోయిన నౌకలపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. ఆ నౌకల్లో పనిచేస్తున్న భారతీయ సిబ్బంది సురక్షితంగా ఉండేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.

దేశానికి అవసరమైన ముడి చమురు, ఎల్పీజీ నిల్వలు ప్రస్తుతం సరిపడా ఉన్నాయని ప్రధాని స్పష్టం చేశారు. అయితే పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం భారత్‌కు కూడా ఆందోళనకరమన్నారు. భారతీయుల జీవనోపాధి, భద్రత రక్షణ అత్యంత ముఖ్యమని పేర్కొన్న ప్రధాని, పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తూ తగిన నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అన్ని విభాగాలతో సమన్వయం చేసుకుంటూ ముందస్తు చర్యలు చేపడుతోందన్నారు. ఈ పరిణామాలపై ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తూ, అవసరమైతే మరిన్ని చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉందని ప్రధాని మోడీ పేర్కొన్నారు.

Leave a Reply