ఇందిరమ్మ ఇళ్ల అధికారుల అవినీతి బయటపెడతా..
ఇందిరమ్మ ఇళ్ల అధికారుల అవినీతి బయటపెడతా..
వికారాబాద్, ఆంధ్రప్రభ : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు నేరుగా వారి ఖాతాలలో డబ్బు జమవుతున్నట్టు ప్రభుత్వం ప్రకటిస్తున్నప్పటికీ హౌసింగ్ అధికారులు మామూలు స్వీకరిస్తున్నారని.. ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారాలు తమ వద్దు ఉన్నాయని.. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ స్పందించి సంబంధిత అధికారుల పై చర్యలు తీసుకోవాలని వికారాబాద్ జిల్లా ఆర్టిఏ మెంబర్ ఎర్రవలి జాఫర్ తెలిపారు. హౌసింగ్ అధికారులు లబ్ధిదారులకు ఫోన్ చేసి తమకు మామూలు అందించినదే బిల్ పాస్ కాదని బెదిరిస్తున్నారని.. ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారాలు కావాలంటే.. అధికారులకు సమర్పిస్తానని ఆయన అన్నారు.
ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల్లో అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉందని ఈ విషయంలో అధికారులు ఆలోచించాలని ఆయన సూచించారు. ప్రధానంగా హౌసింగ్ అధికారులు చేస్తున్న నిర్వాకం వల్ల జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్పీకర్ ప్రసాద్ కుమార్ కు చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. త్వరలో ఇందుకు సంబంధించిన అధికారుల జాబితా వారి రికార్డింగ్లను జిల్లా కలెక్టర్కు సమర్పించేందుకు తాను సిద్ధంగా ఉన్నాను అని స్పష్టం చేశారు.
