100 Hottest | ప్రపంచ రికార్డుల్లో మంచిర్యాల

100 Hottest | ప్రపంచ రికార్డుల్లో మంచిర్యాల

‍ప్రపంచంలోనే అత్యంత వేడి నగరాల జాబితాలో 14వ స్థానంలో మంచిర్యాల
ప్రకటించిన అమెరికాకు చెందిన ‘ఎల్డోరాడో వెదర్’ సంస్థ
అత్యధికంగా 43.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లోనూ 41 డిగ్రీలు దాటిన ఎండలు

100 Hottest | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: తెలంగాణా రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడి ప్రతాపానికి ప్రజలు విలవిలలాడుతున్నారు. ఎండల తీవ్రత ఏ రేంజ్‌లో ఉందంటే.. అమెరికాకు చెందిన ‘ఎల్డోరాడో వెదర్’ సంస్థ ప్రకటించిన ప్రపంచంలోని టాప్ 100 అత్యంత వేడి నగరాల జాబితాలో మంచిర్యాల జిల్లా ఏకంగా 14వ స్థానంలో నిలవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అకోలా (మహారాష్ట్ర) ‍ 45°C ఉష్ణోగ్రత నమోదుతో ఎల్డోరాడో జాబితాలో ప్రపంచంలోనే తొలి స్థానంలో ఉంది. మంచిర్యాలలో ‍‍‍ 43.4°C కొత్తగూడెం, గద్వాల ‍ 43.3°C, నిర్మల్, నిజామాబాద్ 43.0°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రాంతంలో ఎండలు ఇంత తీవ్రంగా ఉండటానికి భౌగోళిక కారణాలతో పాటు అటవీ విస్తీర్ణం తగ్గడమే ప్రధాన కారణమని వాతావరణ శాఖ శాస్త్రవేత్తలు తెలిపారు. మహారాష్ట్రలోని విదర్భ సరిహద్దులో ఉండటం వల్ల, మధ్య భారతం నుంచి వీచే పొడి, వేడి గాలులు ఇక్కడ ఉష్ణోగ్రతలను అమాంతం పెంచుతున్నాయి. దీనికి తోడు 2021లో 18,561 చదరపు కిలోమీటర్లుగా ఉన్న తెలంగాణ అటవీ విస్తీర్ణం, 2023 నాటికి 18,456 చదరపు కిలోమీటర్లకు తగ్గిందన్నారు. ప్రధానంగా ఆదిలాబాద్, కొత్తగూడెం, ఆసిఫాబాద్ జిల్లాల్లో పచ్చదనం తగ్గడం వల్లే సహజసిద్ధమైన చల్లదనం లోపించి హీట్ వేవ్స్ తీవ్రత పెరుగుతోందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

మరోవైపు రాజధాని హైదరాబాద్లోనూ గ్లోబల్ హీట్ లిస్టులో చేరుతున్నాయి. నగరంలోని న్యూ నాగోల్ ప్రాంతంలో 41.7 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా, ముషీరాబాద్‌లో 41.6, అంబర్‌పేటలో 41.4, మల్కాజిగిరి, ఎల్బీనగర్ ప్రాంతాల్లో 41.3, మెహదీపట్నంలో 41.1 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

రాష్ట్రవ్యాప్తంగా పగటిపూట ఎండలు దంచికొడుతున్నా.. నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, హైదరాబాద్, వరంగల్, హనుమకొండ, వికారాబాద్, మెదక్, మేడ్చల్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో రానున్న 24 గంటల్లో.. సాయంత్రం వేళ ఉరుములు, మెరుపులతో కూడిన గాలివాన కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అయితే, పగటి పూట ఎండ తీవ్రత మాత్రం 40 నుంచి 45 డిగ్రీల మధ్యే కొనసాగే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు.

Leave a Reply