Harish Rao | కొండా–కడియం వివాదంపై మహేశ్ కుమార్ గౌడ్

Harish Rao | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. మూడు నెలలు నీటిపారుదల శాఖ బాధ్యతలు ఇస్తే రాష్ట్రంలోని నీటి సమస్యలను పరిష్కరిస్తానన్న హరీశ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. హరీశ్ రావు నిజంగా కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుంటే పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు.

మీడియాతో మాట్లాడిన మహేశ్ కుమార్ గౌడ్.. రాజకీయ వ్యవహారాల కమిటీలో చర్చించిన తర్వాత హరీశ్‌ను పార్టీలో చేర్చుకోవాలా లేదా అన్న విషయంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. పదేళ్లపాటు అధికారంలో ఉండి చేయలేని పనిని మూడు నెలల్లో ఎలా చేస్తారని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులు, అప్పుల భారాన్ని సరిచేసే పనిలో ప్రస్తుత ప్రభుత్వం ఉందన్నారు.

కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలపై స్పందించిన ఆయన.. పార్టీలో భిన్నాభిప్రాయాలు సహజమని పేర్కొన్నారు. మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య నెలకొన్న విభేదాలతో పాటు తుంగతుర్తి నియోజకవర్గంలోని సమస్యలను కూడా చర్చల ద్వారా పరిష్కరిస్తామని చెప్పారు. ఇరు వర్గాల అభిప్రాయాలు విన్న తర్వాతే నిర్ణయం తీసుకుంటామని, పార్టీలో అందరూ సమానమేనని స్పష్టం చేశారు.

క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బిజీగా ఉండటంతో సమస్యల పరిష్కారం కోసం ఇద్దరు సీనియర్ నేతలను నియమించినట్లు తెలిపారు. సస్పెన్షన్ ఒక్కటే పరిష్కారం కాదని వ్యాఖ్యానించారు. అలాగే ప్రభుత్వం కూలిపోతుందని బీఆర్‌ఎస్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, ఆ సమయంలో పది మంది ఎమ్మెల్యేలు తమకు మద్దతు ఇచ్చారని అన్నారు. కాళేశ్వరం, నీటి వ్యవహారాలపై మాట్లాడుతున్న ఈటల రాజేందర్ గతంలో మంత్రిగా ఉన్న విషయాన్ని కూడా మహేశ్ కుమార్ గౌడ్ గుర్తు చేశారు.