నరసాపురంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ

  • జాతీయ జెండా ప్రాధాన్యంపై ప్రజలకు అవగాహన
  • దేశభక్తి నినాదాలతో హోరెత్తిన పట్టణ వీధులు

నరసాపురం, ఆంధ్రప్రభ: దేశభక్తి భావాన్ని పెంపొందించడం, జాతీయ జెండా ప్రాముఖ్యతను ప్రజల్లో చాటిచెప్పడం లక్ష్యంగా ‘హర్ ఘర్ తిరంగా–2026’ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు 7(ఏ) నేవల్ యూనిట్ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కమాండర్ శ్రేయ్ దీక్షిత్ తెలిపారు. ఇందులో భాగంగా స్థానిక శ్రీ వైఎన్ కళాశాల 7(ఏ) నేవల్ యూనిట్ ఆధ్వర్యంలో గురువారం హర్ ఘర్ తిరంగా ర్యాలీని ఘనంగా నిర్వహించారు.

నరసాపురం టౌన్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆకుక రఘు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. 7(ఏ) నేవల్ యూనిట్ నుంచి ర్యాలీ ప్రారంభమై పట్టణంలోని ప్రధాన వీధుల మీదుగా సాగింది. శ్రీ వైఎన్ కళాశాల, ఏఎస్‌ఎన్‌ఎం కళాశాల, ఎస్‌వీకేపీ కళాశాల, స్వర్ణాంధ్ర కళాశాల, ఛాంబర్స్ కళాశాలలకు చెందిన ఎన్‌సీసీ క్యాడెట్లు జాతీయ జెండాలను చేతబట్టి ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా క్యాడెట్లు ’హర్ ఘర్ తిరంగా–ప్రతి ఇంటా త్రివర్ణ పతాకం’, ‘జై హింద్’, ‘వందే మాతరం’ అంటూ నినాదాలు చేయడంతో పట్టణ వీధులు మార్మోగాయి. దేశ స్వాతంత్ర్యం కోసం త్యాగాలు చేసిన మహనీయులను స్మరించుకుంటూ ప్రతి ఒక్కరూ జాతీయ జెండాను గౌరవించాలని క్యాడెట్లు ప్రజలకు సందేశం ఇచ్చారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.