గుర్తుతెలియని వాహనం ఢీ..
రాయపర్తి, ఆంధ్రప్రభ : రాయపర్తి మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుర్తుతెలియని కారు ఢీకొట్టడంతో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల వివరాల ప్రకారం.. కలకత్తాకు చెందిన సత్యం (26) నాటు పనుల కోసం రాయపర్తికి వచ్చాడు. పనులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా రోడ్డు దాటుతున్న సమయంలో వేగంగా వచ్చిన గుర్తుతెలియని కారు అతడిని బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో సత్యం రోడ్డుపై పడిపోవడంతో తలకు తీవ్ర గాయమై రక్తపు మడుగులో పడ్డాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించారు. అదే సమయంలో విధుల్లో ఉన్న స్థానిక పోలీస్ కానిస్టేబుల్ ప్రవీణ్ ఘటనా స్థలానికి చేరుకుని 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు.
అంబులెన్స్ వచ్చే వరకు గాయపడిన యువకుడికి తోడుగా ఉన్న కానిస్టేబుల్ ప్రవీణ్.. అనంతరం 108 వాహనంలో సత్యాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడికి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న రాయపర్తి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై వివరాలు సేకరించారు. గుర్తుతెలియని వాహనం కోసం దర్యాప్తు చేపట్టారు.
