కూటమి ప్రభుత్వంపై వెలంపల్లి ఫైర్
పెనుగంచిప్రోలు, ఆంధ్రప్రభ : మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక జడ్పీటీసీ నాగమణి, ఎంపీటీసీ గాంధీ తదితర పెద్దల ఆహ్వానం మేరకు మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పెనుగంచిప్రోలులోని వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని సందర్శించారు. జగయ్యపేట నియోజకవర్గ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు, పార్టీ నాయకులు కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ, ప్రస్తుత కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఇటీవల జరిగిన డిఎస్సీ నియామకాల్లో భారీ ఎత్తున అక్రమాలు అవకతవకలు జరిగాయని వెలంపల్లి తీవ్రంగా ఆరోపించారు. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా నియామకాల విషయంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తోడల్లుడు భరత్, కోనా రవికుమార్ ఇచ్చిన తప్పుడు సర్టిఫికెట్లతో ఉద్యోగాలు ఇచ్చుకున్నారని విమర్శించారు. అర్హులైన అభ్యర్థులను పక్కనబెట్టి, సర్టిఫికెట్లు మార్చి ఉద్యోగాలు రాలేదని తప్పుడు సంకేతాలు ఇస్తున్నారని మండిపడ్డారు. ఈ అక్రమాలన్నింటిపై తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలని, ఈ వైఫల్యాలకు లోపాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
దీనిపై ఇప్పటికే టౌన్ హాల్ మీటింగ్స్, రిలే నిరాహార దీక్షలు, ర్యాలీలు చెప్పటినట్లు తెలిపారు. యువగళం పాదయాత్ర సందర్భంగా యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మోసం చేశారని, ఇప్పటివరకు ఏ ఒక్క నిరుద్యోగికి భృతి ఇవ్వలేదని దుయ్యబట్టారు. అలాగే, విద్యార్థుల భవిష్యత్తు కోసం స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ‘ఫీజు రీయింబర్స్మెంట్’ పథకానికి బకాయిలు పెట్టి, విద్యార్థులకు ఇబ్బందులు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో పారదర్శకంగా ఉద్యోగాలు ఇచ్చామని, ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం కూడా దాన్ని తప్పుపట్టలేకపోయిందని గుర్తుచేశారు.
అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే దేశంలో రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న ఏకైక ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వమేనని విమర్శించారు. చంద్రబాబు నాయుడు “దేశంలోనే అత్యంత సీనియర్ నాయకుడిని” అని చెప్పుకుంటారు కానీ, ఆయన సొంతంగా ప్రవేశపెట్టిన ఒక్క పథకం కూడా చెప్పుకోవడానికి లేదని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్, వైఎస్సార్, అతి తక్కువ సమయంలో జగన్ మోహన్ రెడ్డి తీసుకొచ్చిన అమ్మఒడి, రైతు భరోసా, గ్రామ, వార్డు సచివాలయాలు, చేయూత వంటి పథకాలను ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని తెలిపారు. ఈ ప్రభుత్వం స్వతహాగా ఏమీ చేయలేక, కేవలం వైఎస్ జగన్ ప్రారంభించిన పనులకు తిరిగి రిబ్బన్ కటింగ్లు చేసుకుంటూ కాలక్షేపం చేస్తోందన్నారు. ఎన్నికల ముందు బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పెన్షన్లు ఇస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు 60 ఏళ్లు దాటిన వారికి కూడా కొత్త పెన్షన్లు ప్రారంభించడం లేదని మండిపడ్డారు.
భర్త చనిపోయిన మహిళలకు కూడా పెన్షన్లు ఇవ్వని దారుణ పరిస్థితి ఉందన్నారు. గతంలో వైఎస్ జగన్ పెన్షన్ వయస్సును 65 నుంచి 60 ఏళ్లకు తగ్గించి, పెన్షన్ మొత్తాన్ని పెంచారని గుర్తుచేశారు. ఇప్పుడు పథకాలు అమలు కాక, అభివృద్ధి శూన్యమై, విజయవాడ ధర్నా చౌక్ సాక్షిగా కేవలం 6 నెలల్లోనే ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపే పరిస్థితి వచ్చిందన్నారు.దేవాలయాల అభివృద్ధిపై మాట్లాడుతూ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విజయవాడ అమ్మవారి దేవాలయానికి రూ.70 కోట్లు జీవో ఇచ్చి అభివృద్ధి చేశామని, దేవదాయ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో పెనుగంచిప్రోలు అమ్మవారి దేవాలయానికి రూ.14 కోట్లు కేటాయించామని గుర్తుచేశారు. కాణిపాకం, గండి ఆంజనేయస్వామి ఆలయం మొదలుకొని రాష్ట్రంలోని అన్ని దేవాలయాలను జగన్ మోహన్ రెడ్డి అభివృద్ధి చేశారని గర్వంగా చెప్పారు.
అయితే, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల కూటమి ప్రభుత్వం హిందూ దేవుళ్లను, దేవాలయాలను కేవలం ఓట్ల కోసం మాత్రమే వాడుకుంటోందని.. చెప్పులు వేసుకుని పూజలు చేయడం, గుళ్లను కూల్చేయడం, విగ్రహాలను కార్పొరేషన్ వ్యాన్లలో పంపించడం లాంటి పనులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఎన్నికల ముందు “సంపద సృష్టిస్తాం, శ్రీలంక అయిపోతుంది” అని ప్రచారం చేసిన చంద్రబాబు ప్రభుత్వం, జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్లలో చేసిన అప్పులను రెండేళ్లలోనే చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని విమర్శించారు. రాజ్యాంగబద్ధమైన అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కనబెట్టి, ‘రెడ్ బుక్ రాజ్యాంగం’తో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న ఈ కూటమి ప్రభుత్వానికి పరిపాలించే నైతిక అర్హత లేదని, ప్రజలు త్వరలోనే ఈ దిక్కుమాలిన పరిపాలనకు చెంపపెట్టులాంటి బుద్ధి చెప్తారని హెచ్చరించారు.
