GSLV F 15 – ఇస్రోకు ‘వంద’నం – 100వ రాకెట్ ప్రయోగం సూపర్ సక్సెస్
నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్‌ఎల్‌వీ – ఎఫ్15 రాకెట్
అంతరిక్షంలోకి ఎస్‌వీఎన్ 02 ఉపగ్రహం
నేవిగేషన్ అవసరాలకోసం శాటిలైట్
నిర్ణీతకక్ష్యలోకి చేరిన ఎస్‌వీఎన్ 02 ఉపగ్రహం
ఇస్రో ప్రయోగించిన వందో రాకెట్ ఇది
విజయవంతమైన ప్రయోగం
సంబరాలు చేసుకుంటున్న శాస్త్రవేత్తలు
అభినందించిన రాష్ట్రపతి, ప్రధాని
శ్రీహరికోట, ఆంధ్రప్రభః ఇస్రో నేడు ప్రయోగించిన 100వ రాకెట్ సూపర్ సక్సెస్ అయింది. నేటి ఉదయం 6.23 గంటలకు శ్రీహరికోట నుంచి జీఎస్‌ఎల్‌వీ – ఎఫ్15 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ రాకెట్ ద్వారా ఎస్‌వీఎన్ 02 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపారు.. నిర్ధారించిన కక్ష్యలోకి శాటిలైట్ చేరుకోవడంతో ఇస్రో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు.. వంద రాకెట్లను ప్రయోగించిన కేంద్రంగా ఇస్రో సరికొత్త రికార్డ్ ను నమోదు చేసుకుంది.. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ ఇస్రో సిబ్బందిని అభినందించారు..
నేవీగేషన్ అవసరాల కోసం…
కాగా ప్రస్తుతం నింగిలోకి వెళ్లిన ఎస్‌వీఎన్ 02 ఉపగ్రహాన్ని దేశ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్(నావిక్)లో భాగంగా ఈ రాకెట్‌ను పంపారు.. నావిక్ అనేది పూర్తిగా స్వదేశీ ప్రాంతీయ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ.ఇది భారత విమానయాన, నౌకాయాన మార్గాలకు.. ఇతర సైనిక అవసరాలకు ఉపయోగపడుతుంది. నావిక్’తో భారత్‌లో, భారత సరిహద్దుల నుంచి 1500 కిలోమీటర్ల దూరం వరకు కచ్చితమైన నేవిగేషన్ సమాచారం తెలుసుకోవచ్చు.’నావిక్’ కోసం ఇప్పటికే వివిధ ఉపగ్రహాలను నింగిలోకి పంపిన ఇస్రో తాజా ప్రయోగంలో ఒక అటామిక్ క్లాక్‌ను నింగిలోకి పంపింది.ఇలాంటి గ్లోబల్ పొజిషనింగ్ వ్యవస్థ పనిచేయడంలో అటామిక్ క్లాక్ చాలా కీలకమని, అందులోనే భారత్ మరింత స్వయం సమృద్ధి సాధించిందని ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ రఘునందన్ తెలిపారు. జీపీఎస్, గ్లోనాస్ వంటి విదేశీ టెక్నాలజీ మీదనే ఆధారపడుతున్న భారత్, ఇకపై మరింతగా నావిక్ మీద ఆధారపడుతుందని రఘునందన్ తెలిపారు.
శ్రీహరికోట నుంచే ఎందుకు?
రాకెట్ ప్రయోగాలకు శ్రీహరికోటను ఎంపిక చేయడానికి ప్రధానంగా 4 కారణాలు చెప్పుకోవచ్చు.
1) అందులో ఒకటి భూమధ్య రేఖకు శ్రీహరికోట దగ్గరగా ఉండటం. ఇక్కడి నుంచి రాకెట్ ప్రయోగిస్తే పైసా ఖర్చు లేకుండా దానికి సెకన్‌కు 0.4 కిలోమీటర్ల అదనపు వేగం వస్తుంది. భూభ్రమణం వల్ల రాకెట్‌కు గంటకు 1440 కిలోమీటర్ల అదనపు వేగం కలిసొస్తుంది.భారత్‌లో శ్రీహరికోట, ఫ్రెంచ్‌గయానాలో కౌరూ, అమెరికాలో ఫ్లోరిడా కెన్నడీ స్పేస్ సెంటర్‌లు భూమధ్య రేఖకు సమీపంగా ఉన్నాయి. ఈ కారణంగానే వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నా.. కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచే యూరప్ దేశాలు రాకెట్లను ప్రయోగిస్తున్నాయి.
2) రాకెట్ ఒక్కసారి గాల్లోకి లేచిన తర్వాత నేరుగా నింగిలోకే వెళ్తుందన్న గ్యారెంటీ అన్నిసార్లూ ఉండకపోవచ్చు.సాంకేతిక కారణాలతో అప్పుడప్పుడు రాకెట్‌లు గాడి తప్పి కూలిపోతూ ఉంటాయి.అలాంటప్పుడు ఆ రాకెట్ శకలాలు జనావాసాల మీద పడితే ప్రాణనష్టం జరుగుతుంది. కానీ, శ్రీహరికోటకు చుట్టూ సముద్రమే ఉంది. అందువల్ల అనుకోని కారణాలతో ప్రయోగం విఫలమై రాకెట్ కూలినా సముద్రంలో పడేందుకే ఎక్కువ అవకాశం ఉంటుంది.
3) రాకెట్ ప్రయోగాలకు వాతావరణం అనుకూలంగా ఉండాలి. ఎక్కువ వర్షపాతం ఉండకూడదు. ఎండలు మండకూడదు. శ్రీహరికోటలో ఏడాది పొడుగునా సాధారణ వాతావరణమే ఉంటుంది.వర్షాలు, ఎండలు అతిగా ఉండవు. ఒక్క అక్టోబర్, నవంబర్‌లో మాత్రమే భారీ వర్షాలు కురుస్తాయి. మిగతా 10నెలలు ప్రయోగాలకు అనుకూల సమయమే.
4) రాకెట్ ప్రయోగం సమయంలో భూమి తీవ్రంగా కంపిస్తుంది. దాన్ని తట్టుకునేలా భూమి అత్యంత ధృడంగా ఉండాలి. శ్రీహరికోటలో భూమి రాళ్లతో అత్యంత ధృడంగా ఉంటుంది. రాకెట్ ప్రయోగ కేంద్రం ఏర్పాటుకు శ్రీహరికోట ఒక ఆప్షన్ కాదు. భారత్‌కు ఉన్న అరుదైన అవకాశం. శ్రీహరి కోటను మించిన ప్రదేశం మరొకటి భారతదేశంలో లేదు. అందుకే ఇది (రాకెట్ ప్రయోగాల కోట) అయింది.
నిజానికి అంతరిక్ష పరిశోధనా ప్రయోగ కేంద్రాన్ని మొదట కేరళలోని తుంబలో ఏర్పాటు చేశారు.తొలుత రాకెట్ల ప్రయోగ కేంద్రంగా ఉన్న తుంబ, తర్వాత పూర్తిస్థాయి రాకెట్ నిర్మాణ కేంద్రంగా మారింది.