సమస్యలు పరిష్కరించే ప్రభావశీల వేదికలు గ్రామ సభలు
సమస్యలు పరిష్కరించే ప్రభావశీల వేదికలు గ్రామ సభలు
– డీఆర్డీఓ విద్యా చందన
జూలూరుపాడు, ఆంధ్రప్రభ :
ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం చూపించే వేదికలుగా గ్రామ సభలు ప్రభావశీలంగా ఉపయోగపడతాయని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్, డీఆర్డీఓ విద్యా చందన అన్నారు. సోమవారం జూలూరుపాడు మండలం మాచినేని పేట తండాలో ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా గ్రామ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీఆర్డీఓ విద్యా చందన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ వ్యర్థాల తొలగింపు శాస్త్రీయ పద్ధతుల్లో జరగాలని, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ద్వారా పరిశుభ్రమైన గ్రామాల నిర్మాణం సాధ్యమవుతుందని తెలిపారు. వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో గ్రామాల్లో డ్రైనేజీల శుభ్రత, నీరు నిల్వ కాకుండా చర్యలు తీసుకోవాలని, వీధుల్లో చెత్త, పిచ్చి మొక్కలు తొలగించాలని సూచించారు. పారిశుధ్య పనులను నిరంతరం పర్యవేక్షించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా జరుగుతున్న అభివృద్ధి పనులు, ప్రజల భాగస్వామ్యం, రైతులకు వ్యవసాయ శాఖ సూచనలు వంటి అంశాలపై ఆమె వివరించారు. పేదల అభివృద్ధి, సంక్షేమ పథకాలు అర్హులైన వారికి చేరేలా చూడాలని పేర్కొన్నారు. గ్రామ సభలకు అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరై ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని పరిష్కార చర్యలు చేపట్టాలని ఆమె సూచించారు. హాజరు కాని అధికారుల వివరాలను సేకరించి నివేదిక సమర్పించాలని ఎంపీడీఓను ఆదేశించారు.
మాచినేని పేట తండా సర్పంచ్ లకావత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ గ్రామ సభలో ఎపిడి రమణ, ఎంపీడీఓ తాళ్లూరి రవి, ఎస్సై బాదావత్ రవి, ఎంపీఓ తులసీరామ్, ఎంఈఓ జూంకిలాల్, వెలుగు సీసీ బండ్ల మధు, పంచాయతీ కార్యదర్శి జ్యోతి, ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ మూడ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
