ఓగేరు వాగుపై క్షేత్రస్థాయి పరిశీలన..

ఓగేరు వాగుపై క్షేత్రస్థాయి పరిశీలన..
ఓగేరు వాగు కరకట్టలను పరిశీలిస్తున్న డ్రైనేజీ బోర్డు ఏఈఈ సత్తి సుబ్బరామిరెడ్డి
త్వరలో కరకట్టల మరమ్మతులు – గోశాల ఆవులు వెళ్లేందుకు దారి ఏర్పాటు
డ్రైనేజ్ బోర్డు ఏఈఈ సత్తి సుబ్బరామిరెడ్డి
చిలకలూరిపేట టౌన్, ఆంధ్రప్రభ : ఓగేరు వాగు దుస్థితిపై ఆంధ్రప్రభలో వరుసగా వెలువడుతున్న కథనాలకు స్పందించిన డ్రైనేజ్ బోర్డు అధికారులు మంగళవారం క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించారు. డ్రైనేజ్ బోర్డు ఏఈఈ సత్తి సుబ్బరామిరెడ్డి డ్రైనేజ్ బోర్డు సిబ్బందితో కలిసి ఓగేరు వాగు పరిసర ప్రాంతాలను, కరకట్టలను పరిశీలించారు.ముఖ్యంగా బొందిలిపాలెం స్మశాన వాటిక సమీపంలోని కరకట్టలు బలహీనపడిన పరిస్థితిని గమనించారు. వాగులో కంపచెట్లు, పొదలు విస్తరించి నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారిన దృశ్యాలు అధికారుల దృష్టికి వచ్చాయి. వర్షాకాలంలో ప్రవాహం పెరిగితే కరకట్టలు మరింత దెబ్బతినే ప్రమాదం ఉందని స్థానికులు వివరించారు.
కరగట్ట పక్కన ఉన్న గోశాలలోని ఆవులు కట్టపైగా పొలాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని గోశాల కార్యవర్గ సభ్యులు ఆయనకు తెలిపారు. మధ్యలో కట్ట తెగిపోయి ఉండటంతో పసుమర్తి బ్రిడ్జి వైపు వెళ్లడం కష్టమైందని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన జేఈ, తెగిపోయిన భాగాన్ని అత్యవసరంగా మరమ్మతు చేస్తామని హామీ ఇచ్చారు.అలాగే ఓగేరు వాగు బ్రిడ్జి రెండోవైపు పసుమర్తి ప్రాంతంలో కూడా కరకట్టలు దెబ్బతిన్నాయని రైతులు ఫిర్యాదు చేశారు. వర్షాకాలానికి ముందే ఈ ప్రాంతాల్లో బలోపేత చర్యలు చేపట్టాలని కోరారు. ఏఈఈ సత్తి సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ ఓగేరు వాగు కరకట్టల పై అక్రమణలకు, లేదా కరకట్ట మట్టిని తరలించడానికి ప్రయత్నాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వాగులో పేరుకుపోయిన మట్టి, చెత్త, కంపచెట్లను తొలగించి నీటి ప్రవాహాన్ని సాఫీగా ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఓగేరువాగును పవిత్రంగా ఉంచేందుకు, రైతులకు వ్యవసాయానికి అవసరమైన వీటిని అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని అవసరమైన అంచనాలు సిద్ధం చేసి బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పిస్తామని చెప్పారు. అత్యవసరంగా అవసరమైన చోట తాత్కాలిక రక్షణ చర్యలు కూడా చేపడతామని పేర్కొన్నారు. ప్రాంత ప్రజలు, రైతులు, గోశాల సభ్యులు సమస్యలను ప్రత్యక్షంగా అధికారుల దృష్టికి తీసుకురావడంతో పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయని స్థానికులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో డ్రైనేజ్ బోర్డు సిబ్బంది విడుదల మురళీకృష్ణ, గోశాల ప్రతినిధి సూర్యరావు తదితరులు పాల్గొన్నారు.
