FormerChiefMinister | మోసానికి చొక్కా, ప్యాంటు తగిలిస్తే క‌నిపించేది చంద్రబాబే

FormerChiefMinister | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: ఒక మోసానికి చొక్కా, ప్యాంటు తగిలిస్తే కనిపించేది చంద్రబాబేన‌ని వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆయ‌న‌ మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా ఏపీలో జరిగిన డీఎస్సీ అవకతవకలపై కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం లక్షలాది మంది అభ్యర్థులు రాసే డీఎస్సీ పరీక్షల నిర్వహణలో తీవ్ర లీకేజీలు, అవకతవకలు, స్కామ్‌లు జరిగాయని వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు చేశారు. పరీక్షలు నిర్వహించిన విధానం షాకింగ్‌గా, ఆందోళనకరంగా ఉందన్నారు. చంద్రబాబు నాయుడు నిరుద్యోగుల నమ్మకాన్ని వమ్ము చేశారని, ఈ స్కామ్‌ల వల్ల ప్రతిభావంతులైన యువత జీవితాలు దారుణంగా దెబ్బతిన్నాయని.. ఈ వాస్తవాలను ప్రజల ముందుకు తెస్తామని జగన్ స్పష్టం చేశారు.

డీఎస్సీ విషయంలో ఇవాళ వెలుగులోకి వస్తున్న విషయాలన్నీ చూస్తుంటే చాలా చాలా షాక్ కలిగిస్తున్నాయన్నారు. లక్షల మంది అభ్యర్థుల నమ్మకాన్ని చంద్రబాబు ప్రభుత్వం వమ్ము చేసిందన్నారు. స్కాములు చేస్తూ, ప్రతిభావంతుల జీవితాలను దారుణంగా దెబ్బతీసిందన్నారు. ఇంత ఘోరంగా రిక్రూట్మెంట్ చేయడం అన్నది ఎప్పుడూ, ఎక్కడా చూడలేదన్నారు. డీఎస్సీ అంటే లక్షల మంది యువత ఆశ. వారి భవిష్యత్తు అన్నారు. అలాంటి ఉద్యోగ నియామక ప్రక్రియలో కూడా అవినీతి, అక్రమాలకు పాల్పడ‌డం అత్యంత దారుణమ‌న్నారు.

చంద్రబాబు రాజకీయ జీవితాన్ని చూసినా, సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ సహా తన మేనిఫెస్టోలో చెప్పిన హామీలు అయినా, ఇవాళ టీచర్ల రిక్రూట్మెంట్ చూసినా, ఇవన్నీ చాలా స్పష్టంగా కనిపిస్తాయన్నారు. 16వేల పోస్టులకే ఇన్ని స్కామ్ లు, లీకులు కనిపిస్తున్నాయన్నారు. త‌మ‌ ప్రభుత్వంలో ఒకే సమయంలో ఒకే నోటిఫికేషన్ ఇచ్చామ‌న్నారు.

లక్షా 30వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేశామ‌న్నారు. దేశ చరిత్రలోనే లేని విధంగా ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చామ‌న్నారు. 2019 మే 30న సీఎంగా ప్రమాణం చేసిన 50 రోజుల్లోనే జీవో ఇచ్చామ‌న్నారు. 19 లక్షల మంది పరీక్షలు రాస్తే ఒక్క తప్పు కూడా జరగలేదన్నారు. నాలుగు నెలల్లోనే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ భర్తీ పూర్తి చేశామ‌న్నారు. ఇప్పుడు మాత్రం డీఎస్సీ పేరుతో అభ్యర్థులకు ఆవేదన మిగిల్చారన్నారు.

చంద్రబాబు అధికారంలోకి రాగానే ఐదు తొలి సంతకాలు అంటూ నానా హంగామా ఆర్భాటం చేశాడన్నారు. ఇదికూడా పెద్ద మోసమే. దీంట్లో మెగా డీఎస్సీ అనేది ఒక సంతకమ‌న్నారు. వాస్తవంగా త‌మ ప్రభుత్వ హయాంలోనే 6,100 పోస్టులకు మేం నోటిఫికేషన్ ఇచ్చామ‌న్నారు. వాటిని భర్తీచేయకుండా రద్దుచేసి, రిక్రూట్మెంట్ ఆలస్యం చేశారన్నారు. పైగా ఆ 6,100 పోస్టులతో కలిపి, ఇస్తున్న 16వేల పోస్టులకే మెగా పేరుపెట్టి చివరకు లీకులు, అక్రమాలు, స్కాములు, అవకతవకలు చేశారన్నారు. ఇదీ చంద్రబాబు మొదటి సంతకం పరిస్థితి అన్నారు.

రికార్డు అంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయంలోనే జరిగిందన్నారు. గ్రామ స్వరాజ్య సాధన, సుపరిపాలన లక్ష్య సాధన దిశగా ఆరోజు తాము వేసిన గొప్ప అడుగు, ఉద్యోగాల చరిత్రలో ఒక సువర్ణాధ్యాయమ‌న్నారు. ఎవ్వరూ బద్దలు కొట్టలేని ఓ రికార్డు అన్నారు. మే 30, 2019న తాను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తే, జులై 19న జీవో ఇచ్చామ‌న్నారు. జులై 25 – 27 మధ్య నోటిఫికేషన్లు ఇచ్చామని జ‌గ‌న్ అన్నారు.

Leave a Reply