ధర్మసాగర్ నార్త్ దేవాదుల కాలువ ద్వారా సాగునీటి విడుదల

రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా చర్యలు.. పొన్నం ప్రభాకర్‌కు కృతజ్ఞతలు

ఎల్కతుర్తి, ఆంధ్రప్రభ: ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాల రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ధర్మసాగర్ నార్త్ దేవాదుల కాలువ ద్వారా సాగునీటిని సోమవారం విడుదల చేశారు. ధర్మసాగర్ ప్రాజెక్టు వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఎల్కతుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముప్పు శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. ధర్మసాగర్ నార్త్ దేవాదుల కాలువ ద్వారా సాగునీరు విడుదల కావడంతో ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాల్లో వేలాది ఎకరాల్లో సాగవుతున్న వరి, ఇతర పంటలకు నీరు అందుతుందని తెలిపారు. దీంతో రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు.

రైతుల సమస్యను గుర్తించి, సాగునీటి విడుదలకు ప్రత్యేక చొరవ తీసుకున్న రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి, హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్‌కు రెండు మండలాల రైతుల తరఫున కాంగ్రెస్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎల్కతుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎలిగేటి ఇంద్రసేనారెడ్డి, ఎల్కతుర్తి మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అంబాల శ్రీకాంత్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ రమేష్ బాబు, మాజీ ఉపసర్పంచ్ ప్రవీణ్, భీమదేవరపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు ప్రకాశ్, ముల్కనూర్ సర్పంచ్ ప్రమోద్ రెడ్డి, నీటిపారుదల శాఖ అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.