అంగవైకల్యాన్ని రూపుమాపడానికే పోలియో చుక్కలు
జైనూర్, ఆంధ్రప్రభ: మన పిల్లల భవిష్యత్తు మన చేతుల్లోనే ఉందని, అంగవైకల్యాన్ని రూపుమాపడానికే ప్రభుత్వం ప్రత్యేక పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తోందని జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిమేత విశ్వనాథరావు, మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కొడప ప్రకాష్ అన్నారు. ఆదివారం కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలోని బాలాజీ నగర్లో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని వారు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా చైర్మన్, సర్పంచ్ కలిసి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ 0 నుండి 5 సంవత్సరాల లోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. పోలియో రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో స్థానిక వైద్య అధికారులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
