జగన్ గో బ్యాక్..
ఓర్వకల్లు విమానాశ్రయం వద్ద వ్యతిరేక ఫ్లెక్సీలు..
కర్నూలు రూరల్ బ్యూరో, ఆగస్టు 13, ఆంధ్రప్రభ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కర్నూలు పర్యటన నేపథ్యంలో ఓర్వకల్లు విమానాశ్రయం వద్ద ఆయనకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. విమానాశ్రయ పరిసరాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ‘జగన్ గో బ్యాక్’ అంటూ నినాదాలు కనిపించాయి. ప్రస్తుతం ఈ ఫ్లెక్సీలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
జగన్ గురువారం కర్నూలుకు రానున్న నేపథ్యంలో విమానాశ్రయ పరిసరాల్లో ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీల్లో పలు ప్రశ్నలు సంధించారు. ముఖ్యంగా డీఎస్సీ అంశంపై చర్చించేందుకు జగన్ అసెంబ్లీకి రావాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర అభివృద్ధి, నిరుద్యోగులు, ఉపాధ్యాయ నియామకాల వంటి అంశాలపై అసెంబ్లీ వేదికగా చర్చించాలని పేర్కొన్నారు.
‘ఎస్సీలపై దాడి చేసిన వారిని పరామర్శించేందుకు వచ్చే నైతిక ధైర్యం మీకు ఉందా?’ అంటూ మరో ఫ్లెక్సీలో ప్రశ్నించారు. అలాగే ‘ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి అభివృద్ధిపై చర్చించండి జగన్’ అంటూ సవాల్ విసిరారు.
మల్లెల రాజశేఖర్ పేరుతో ఏర్పాటు…
టీటీడీ బోర్డు సభ్యుడు మల్లెల రాజశేఖర్ పేరుతో ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. జగన్ కర్నూలు పర్యటనకు వస్తున్న సమయంలోనే విమానాశ్రయ పరిసరాల్లో ఆయనకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు కావడంతో రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
ఒకవైపు జగన్ పర్యటనకు వైఎస్సార్సీపీ శ్రేణులు భారీగా సమీకరణకు సన్నాహాలు చేస్తుండగా.. మరోవైపు ఆయనకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు కావడం కర్నూలులో రాజకీయ వేడిని మరింత పెంచింది. దీంతో ఓర్వకల్లు విమానాశ్రయం పరిసరాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు స్థానికంగా రాజకీయ చర్చకు దారితీశాయి.
