పట్టు అధునాతన సాగు పద్ధతులపై శిక్షణ

చెన్నూర్‌, ఆగస్టు 13 (ఆంధ్రప్రభ): ‘నా పట్టు.. నా అభిమానం’ కార్యక్రమంలో భాగంగా కేంద్ర పట్టుపరిశ్రమ బోర్డు ఆధ్వర్యంలో చెన్నూర్‌ క్లస్టర్‌ పరిధిలోని కోటపల్లి మండలం ఎదులబంధం గ్రామంలోని పట్టు రైతులకు అధునాతన సాంకేతిక పద్ధతులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పట్టు పురుగుల పెంపకంలో వ్యాధుల గుర్తింపు, నివారణ, నియంత్రణతో పాటు ఆహార మొక్కలకు వచ్చే వ్యాధులు, తెగుళ్ల నుంచి పంటను కాపాడుకునేందుకు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులు వివరించారు. కేంద్ర పట్టుపరిశ్రమ బోర్డు పరిశోధనా సంస్థలు అభివృద్ధి చేసిన నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులు క్షేత్రస్థాయిలో వినియోగించుకునే విధానాలపై అవగాహన కల్పించారు.

సుమారు 143 మంది పట్టు రైతులకు పట్టు పురుగుల పెంపకంలో శాస్త్రీయ పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, పురుగుల సంరక్షణ, ఉత్పత్తిని మెరుగుపరిచే విధానాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. దేశవ్యాప్తంగా కేంద్ర పట్టుపరిశ్రమ బోర్డు సుమారు 200 కేంద్రాలను ఎంపిక చేసిందని, వాటిలో మంచిర్యాల జిల్లా కూడా ఒకటని అధికారులు తెలిపారు. అధునాతన సాంకేతిక పద్ధతులను అవలంబించడం ద్వారా పట్టు ఉత్పత్తిని పెంచుకోవడంతో పాటు నాణ్యతను మెరుగుపరుచుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పట్టుపరిశ్రమ బోర్డు అధికారులు పార్వతి రాథోడ్‌, శాస్త్రవేత్త కె.పీ. కిరణ్‌కుమార్‌, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.