“డ్రగ్స్ వద్దు బ్రో.. చెస్ ఆడు బ్రో”

“డ్రగ్స్ వద్దు బ్రో.. చెస్ ఆడు బ్రో”

అమరావతిలో అంతర్జాతీయ ఫిడే చెస్ టోర్నమెంట్ ఘన ప్రారంభం

అమరావతి, ఆంధ్రప్రభ : యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి క్రీడలు, సంగీతం వంటి సానుకూల కార్యకలాపాల్లో తమ ప్రతిభను చాటుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు డా. రాయపాటి శైలజ పిలుపునిచ్చారు. వీఐటీ-ఏపీ విశ్వవిద్యాలయం, ఆంధ్రప్రదేశ్ చెస్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో అమరావతిలో నిర్వహిస్తున్న తొలి అంతర్జాతీయ ఫిడే రేటెడ్ చెస్ టోర్నమెంట్ (బిలో-1800)ను ఆమె ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏపీ ఈగల్ చీఫ్ ఏకే రవికృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేకంగా ఈగల్ వ్యవస్థను ఏర్పాటు చేసి గంజాయి, డ్రగ్స్‌పై యుద్ధం ప్రకటించిందన్నారు. “డ్రగ్స్ వద్దు బ్రో – చెస్ ఆడు బ్రో” అనే నినాదంతో యువతలో అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.

చెస్ వంటి మేధోక్రీడలు యువతలో ఏకాగ్రత, క్రమశిక్షణ, వ్యూహాత్మక ఆలోచనలను పెంపొందిస్తాయని, క్రీడాకారులు సమాజానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. టోర్నమెంట్‌లో పాల్గొంటున్న ప్రతి క్రీడాకారుడు “సే నో టు డ్రగ్స్” ఉద్యమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించాలని కోరారు.

డా. రాయపాటి శైలజ మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని అమరావతిలో అంతర్జాతీయ స్థాయి చెస్ టోర్నమెంట్ నిర్వహించడం గర్వకారణమన్నారు. చెస్ కేవలం ఆట మాత్రమే కాదని, ఆలోచనా శక్తి, సహనం, వ్యూహాత్మక దృక్పథాన్ని పెంపొందించే సాధనమని పేర్కొన్నారు. భారత చెస్ దిగ్గజం Koneru Humpy వంటి క్రీడాకారులు ప్రపంచస్థాయిలో సాధించిన విజయాలు యువతకు స్ఫూర్తిగా నిలుస్తాయని చెప్పారు.

యువత డ్రగ్స్‌కు బానిస కాకుండా క్రీడలు, సంగీతం, సృజనాత్మక రంగాల వైపు మళ్లాలని, తల్లిదండ్రులు కూడా పిల్లలను సరైన మార్గంలో ప్రోత్సహించాలని ఆమె సూచించారు.

ఈ సందర్భంగా ఈగల్ ఎస్పీ స్వరూపరాణి క్రీడాకారులతో డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఏపీ ఈగల్ చీఫ్ రవికృష్ణ, డా. రాయపాటి శైలజ చెస్ ఆడి కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ చెస్ అసోసియేషన్ చైర్మన్ కేవీవీ శర్మ, అధ్యక్షుడు డా. అడుసుమిల్లి సురేష్, కార్యదర్శి జగదీష్, VIT-AP University ప్రతినిధులు, అంతర్జాతీయ ఆర్బిటర్ రవిచంద్రన్, ఈగల్ విభాగం అధికారులు, చెస్ క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Leave a Reply