HYD | తెలంగాణలో భిన్న వాతావరణం

HYD | తెలంగాణలో భిన్న వాతావరణం

HYD | ఆంధ్రప్ర‌భ వెబ్‌డెస్క్ : తెలంగాణలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వైపు మ‌ధ్యాహ్న వేళ భానుడు భ‌గ్గుమంటుండ‌గా.. మరోవైపు సాయంత్రం అకాల వర్షాలు వ‌ణికిస్తున్నాయి. రాబోయే రెండు రోజులు ప‌లు జిల్లాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉంద‌ని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు ద్రోణి, క్యుములోనింబస్‌ మేఘాల ప్రభావంతో అకాల వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రించింది. ఉమ్మడి ఖమ్మం, మహబూబ్‌నగర్‌, నల్గొండ, హైదరాబాద్‌తోపాటు మెదక్‌, నిజామాబాద్‌, కామారెడ్డి, సంగారెడ్డి, మహబూబాబాద్‌ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల వడగళ్ల వాన కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.

ఆదివారం హైదరాబాద్‌లో ఈదురుగాలుల వాన కురిసింది. మ‌రో వారం రోజుల పాటు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు చెబుతున్నారు. నేడు మరో 10 జిల్లాల్లో వర్షాలు ప‌డ‌తాయ‌ని చెబుతున్నారు. అలాగే పలు జిల్లాల్లో గంటకు 40 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే సూచన ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ అయ్యాయి. ముఖ్యంగా వడగళ్ల వాన కారణంగా పంట నష్టపోయే ప్రమాదం ఉన్నందులన రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇప్పటికే ధాన్యం కళ్లాల్లో చేర్చినట్లయితే టార్ఫలిన్ కవర్లు కప్పి ఉంచాలని చెబుతున్నారు.