కేబినెట్ భేటీ మధ్యలోనే వెళ్లిపోయిన పవన్
ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురయ్యారని తెలిసింది. ఇవాళ (గురువారం) ఏపీ కేబినెట్ భేటీ జరుగుతున్న సమయంలో పవన్ కల్యాణ్ అకస్మాత్తుగా సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. కేబినెట్ సమావేశం కొనసాగుతున్న సమయంలో పవన్ కల్యాణ్‌కు తీవ్రమైన వెన్నునొప్పి వచ్చినట్లు తెలుస్తోంది. నొప్పి తీవ్రత పెరగడంతో ఆయన సమావేశం నుంచి మధ్యలోనే వెళ్లిపోయినట్లు సమాచారం. అనంతరం మంగళగిరిలోని జనసేన పార్టీ క్యాంప్ కార్యాలయానికి చేరుకుని విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలిసింది.
ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ అనారోగ్యం పాలవుతుండటం ఆయన అభిమానులను, రాజకీయ వర్గాలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. గత నెలలో అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన పవన్.. మరోసారి తాజాగా తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తుండటం షాకింగ్ పరిణామంగా మారింది. సినిమాల్లో రాణిస్తూనే పొలిటికల్ టచ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. రాజకీయంగా కూడా తన మార్క్ చూపిస్తున్నారు. సినిమాల పరంగా చూస్తే రీసెంట్ గా ఓజీ, హరిహర వీరమల్లు సినిమాలు చేశారు.
