Madhya Pradesh | ట్ర‌క్కు – వ్యాన్ ఢీ .. 9 మంది మృతి

భోపాల్ – మధ్య ప్రదేశ్ ఝబువా జిల్లాలో సిమెంట్‌ లోడ్‌తో వెళ్తున్న ట్రక్కు ఎదురుగా వ‌స్తున్న‌ వ్యానును బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెఘ్‌నగర్‌ సమీపంలో బుధవారం తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన కొందరు వివాహ కార్యక్రమాన్ని ముగించుకొని తమ గ్రామానికి వ్యాన్‌లో వెళ్తున్నారు. అదే సమయంలో సిమెంట్‌ లోడ్‌తో వెళ్తున్న ట్రైలర్‌ ట్రక్కు.. సంజేలి రైల్వే క్రాసింగ్ వద్ద తాత్కాలిక రహదారి గుండా నిర్మాణంలో ఉన్న రైల్వే ఓవర్‌ బ్రిడ్జి దాటుతుండగా అదుపు తప్పింది. పక్కన వెళ్తున్న వ్యాన్‌పైకి దూసుకెళ్లింది.

ఈ ప్రమాదంలో వ్యాన్‌లోని తొమ్మిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు ఝబువా పోలీసు సూపరింటెండెంట్‌ పద్మవిలోచన్‌ శుక్లా తెలిపారు. మరో ఇద్దరు గాయపడినట్లు చెప్పారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తీసుకెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

Leave a Reply