Steel plant | స్టీల్ ప్లాంట్ వద్దంటూ రైతుల ఆందోళన

స్టీల్ ప్లాంట్ వద్దంటూ రైతుల ఆందోళన
మద్దతుఇచ్చిన వైసీపీ, జనసేన, సీపీఎం
Steel plant | గుర్ల(విజయనగరం), ఆంధ్రప్రభ : సూపర్ స్మెల్టర్ స్టీల్ ప్లాంట్ విజయనగరం జిల్లా గుర్ల మండలం కెల్ల, మాన్యపురిపేట, దమరసింగి, వల్లా పురం, ఎస్ ఎస్ ఆర్ పేట గ్రామాల పరిధిలో నెలకొల్పేందుకు ప్రభుత్వం ఇటీవల కాలంలో ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆందోళన చెందిన ఆయా గ్రామాల రైతులు తమ పంట భూముల్లో స్టీల్ ప్లాంట్ వద్దంటూ సోమవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అలాగే పాలకొండ విజయనగరం ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. వ్యవసాయ భూములపై వ్యవసాయం చేస్తూ ఆధారపడే రైతులు ఉపాధి కోల్పోతామని ఆందోళన చేశారు.

అలాగే స్టీల్ ప్లాంట్ రాకతో పొల్యూషన్ ఎక్కువవుతుందని పరిసర గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతారని స్టీల్ ప్లాంట్ నిర్మాణ ఆలోచనను ఆ సంస్థ విరమించుకోవాలని పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. సుమారు 400 మంది రైతులు ఆందోళన చేపట్టారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే తహసీల్దార్ సమాధానం చెప్పాలంటూ నినాదాలు చేశారు. వైకాపా నేతలు కేవీ. సూర్యనారాయణ రాజు, పొట్నూరు సన్యాసినాయుడు, సీర అప్పలనాయుడు, తోట తిరుపతి రావు, జమ్ము స్వామి నాయుడు, జనసేన నాయకులు విజినిగిరి శ్రీనివాసరావు, రమేష్ రాజు, రైతు సంఘం అధ్యక్షులు, సీపీఎం నాయకులు తదితరులు రైతులకు మద్దతు ఇచ్చారు.
