చిత్తూరులో లాడ్జీలపై పోలీసుల ఆకస్మిక దాడులు
వ్యభిచార నిర్వహణపై కేసులు నమోదు
10 మంది మహిళలు, ఇద్దరు విటులు అదుపులోకి
ప్రధాన నిర్వాహకుడు పరారీ
చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : చిత్తూరు పట్టణంలోని పలు లాడ్జీలపై పోలీసులు మంగళవారం ఆకస్మిక దాడులు నిర్వహించి వ్యభిచార కార్యకలాపాలను వెలికితీశారు. ఈ దాడుల్లో 10 మంది మహిళలు, ఇద్దరు విటులను అదుపులోకి తీసుకోగా, సంబంధిత లాడ్జీల యజమానులు, మేనేజర్లపై కేసులు నమోదు చేశారు. ప్రధాన నిర్వాహకుడిగా గుర్తించిన దినేష్ అనే వ్యక్తి పరారీలో ఉండగా, అతని కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు.
జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు జిల్లాలో వ్యభిచారం, అసాంఘిక కార్యకలాపాల నిర్మూలన కోసం చేపడుతున్న ప్రత్యేక చర్యల్లో భాగంగా చిత్తూరు ఎస్‌డీపీఓ జె. వెంకటనారాయణ పర్యవేక్షణలో వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ చిన్న పెద్దయ్య ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించారు. ఎస్‌ఐలు శివశంకర్, మారెప్పతో పాటు పోలీసు సిబ్బంది పట్టణంలోని పలు లాడ్జీల్లో తనిఖీలు చేపట్టగా వ్యభిచార కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తించారు.
ప్రాథమిక విచారణలో చిత్తూరుకు చెందిన దినేష్ అనే వ్యక్తి ఈ వ్యవహారానికి ప్రధాన సూత్రధారిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బెంగళూరు, కోల్‌కతా, విశాఖపట్నం, విజయవాడ ప్రాంతాల నుంచి మహిళలను తీసుకొచ్చి చిత్తూరులోని లాడ్జీల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు విచారణలో తేలినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయని, త్వరలోనే అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ చిన్న పెద్దయ్య మాట్లాడుతూ జిల్లాలో వ్యభిచారం, మహిళల అక్రమ రవాణా, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై రాజీ లేకుండా కఠిన చర్యలు కొనసాగిస్తామని హెచ్చరించారు. లాడ్జీలు, హోటళ్లు, గెస్ట్ హౌస్ యాజమాన్యాలు తమ సంస్థల్లో జరిగే కార్యకలాపాలపై పూర్తి బాధ్యత వహించాలని, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు అవకాశం కల్పిస్తే యజమానులు, నిర్వాహకులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
అనుమానాస్పద లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాలు ఎక్కడైనా కనిపించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా 112కు సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
